నెల్లూరంటే నాకు చాలా ఇష్టం. కొన్ని సంవత్సరాలపాటు పెరిగాను. ఇక్కడ ఉప్పు చాలా ఉప్పగా ఉంటుందని చెప్పిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఇప్పుడు అదే ఉప్పు చేదుగా మారినట్లు తెలుస్తోంది. జిల్లాలో ఆయన పార్టీ పరిస్థితి దారుణంగా ఉన్నా పట్టించుకోవడం లేదు. వర్గాలుగా విడిపోయినా తనకేం సంబంధం లేనట్లుగా ఉన్నాడు. పవన్ ప్రత్యేక దృష్టి లేకపోవడంతో తెలుగుదేశం పొత్తు ధర్మాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తోంది.
కొణిదెల వెంకట్రావు ఉద్యోగరీత్యా నెల్లూరులో కొన్ని సంవత్సరాలున్నారు. ఆ సమయంలో మెగా బ్రదర్స్ ఇక్కడ పెరిగారు. పవన్ కూడా చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని చెప్పాడు. ఈ ఊరిలో చదువుకున్నానని ప్రత్యేక అభిమానం ఉందన్నాడు. అలాంటి జిల్లాలో జనసేన రాజకీయంగా చాలా బలంగా ఉండాలి. అయితే టీడీపీ నాయకులు చిన్నచూపు చూసే స్థాయిలో సేన ఉంది. ఆదివారం నెల్లూరులో జరిగిన చంద్రబాబు రా కదలిరా సభలో జనసైనికులకు అవమానాలు ఎదురయ్యాయి. సాక్షాత్తు చంద్రబాబు ప్రియ శిష్యుడు, మాజీ మంత్రి పొంగూరు నారాయణ, టీడీపీ సీనియర్ నాయకుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తమ పార్టీ జెండాలు మాత్రమే రెపరెపలాడాలని జనసేన జెండాలను కిందకు దించాలని ఆ కార్యకర్తలకు హుకుం జారీ చేశారు. ఓ వైపు తెలుగుదేశం జెండాలతో ఆ పార్టీ కార్యకర్తలుండగా.. తమనే ఎందుకు ఇలా అంటున్నారని జనసైనికులు జెండాలను దించలేదు. మనమే సర్దుకుపోదామని సేన జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్‌రెడ్డి ఒక మెట్టు దిగి జెండాలు కిందకు దించాలని తమవాళ్లకు చెప్పారు. అయితే తమకు ఆత్మాభిమానం ఉందంటూ జనసేన కార్యకర్తలు ఆ మాటల్ని పట్టించుకోలేదు. దీంతో మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మైకు అందుకుని ఎవరు చెప్పినా మీరు వినరా అంటూ చిన్నచూపు చూస్తూ అసహనం వ్యక్తం చేశాడు. దీంతో జనసైనికులు బాధపడ్డారు. వాళ్లకో నీతి.. తమకో నీతా అంటూ కొందరు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
కారణం అధ్యక్షుడే..
తను పెరిగి, చదువుకున్న నెల్లూరు జిల్లాలో జనసేన ఈ స్థితికి రావడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణే. ఇక్కడ పవన్, నాగబాబు వర్గాలుగా నేతలు విడిపోయి కత్తులు దూసుకుంటున్నా.. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నా ఏనాడూ పట్టించుకోలేదు. మొక్కుబడిగా సమీక్షలు పెట్టి వదిలేశాడు. పొత్తులో చూస్తే ఇక్కడ తెలుగుదేశం మాటే నెగ్గుతుంది. సేనకు చెప్పుకోదగిన నాయకుడు ఒక్కడు కూడా లేడు. పవన్ పార్టీకి జిల్లా అధ్యక్షుడి ఉన్న మనుక్రాంత్‌రెడ్డి రబ్బర్ స్టాంప్ మాత్రమే. ఈయన 2019లో నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. ఈసారి సిటీ నుంచి బరిలో ఉండాలని కొద్దిరోజులు తిరిగాడు. అయితే పవన్ ఆదేశాలతో ఆగిపోయాడు. కారణం టీడీపీ ఆర్థిక స్తంభమైన పొంగూరు నారాయణ సిటీ సీటులో కర్చీఫ్ వేశాడు. ఈయన అభ్యర్థిత్వాన్ని పవన్ కాదనలేడు. సంప్రదాయంలో భాగంగా రూరల్ సీటు ఇస్తారా అంటే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఒప్పుకోడు. చంద్రబాబు అంగీకారంతోనే పార్టీ మారనని ఆయన చెబుతున్నాడు. బాబు, లోకేశ్‌ల భజన అందుకుని ప్రచారం చేసుకుంటున్నాడు.
అన్ని చోట్లా అంతే..
కొత్త నెల్లూరు జిల్లాలో జనసేనకు టీడీపీ సీటు కేటాయించే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయి. కోవూరులో మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తనయుడు దినేష్‌రెడ్డి తిరుగున్నాడు. ఆయన తనకే సీటు ఓకే అయిందని చెబుతున్నాడు. కావలిలో మైనింగ్ డాన్‌గా పేరున్న కావ్య కృష్ణారెడ్డి టికెట్ ఆశిస్తున్నాడు. ఈ నియోజకవర్గంపై టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు బీద రవిచంద్ర పెత్తనం ఎక్కువ. ఆయన జనసేనను ఊసులోకి కూడా రానివ్వడు. ఉదయగిరిలో బొల్లినేని రామారావు టికెట్ రేసులో ఉన్నాడు. తెలుగుదేశం ఆర్థిక స్తంభాల్లో ఈయన ఒకడు. ఆత్మకూరు నుంచి ఆనం రామనారాయణరెడ్డి పోటీ చేయొకపోవచ్చని వార్తలు వస్తున్నా ఇక్కడ సేనకు బలమైన నాయకుడంటూ ఎవరూ లేరు. సర్వేపల్లిలో సోమిరెడ్డి కాచుకుని ఉన్నాడు. నారా లోకేశ్‌కు ఇష్టం లేకపోయినా చంద్రబాబు ఈయన్ను కాదనడం కష్టమే. కందుకూరులో ఇంటూరి బ్రదర్స్ టికెట్ కోసం కొట్టుకుంటున్న పరిస్థితి. అక్కడ మూడో మనిషిని రానిచ్చే అవకాశం ఏ మాత్రం లేదు. ఇకపోతే నెల్లూరు ఎంపీ సీటు తీసుకుని పోటీ చేసేంత సీన్ సేనకు లేదు. ఈ విషయం వాళ్లకు కూడా తెలుసు. ఎంతో ఇష్టమైన జిల్లాలోనే పవన్ తన పార్టీకి ఇలాంటి స్థితి కల్పించాడు. భవిష్యత్‌లోనూ దానిని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయడు. ఏ నాయకుడిని ఎదగనివ్వడు. ఇది నిజం. టీడీపీ చెప్పినట్లు వినాలని తమ పార్టీ వారికి చెప్పి పైకి మాత్రం కాకమ్మ కబుర్లు చెబుతుంటాడు. మొత్తానికి ఏ జిల్లాలో చూసినా సేన ఇలాగే ఉంది. అధ్యక్షుడి ధన దాహమే ఇందుకు ప్రధాన కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.