ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ బస్సులు, ట్రక్స్ తయారీ క్లస్టర్ యూనిట్ ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు కాబోతోంది. జర్మనీకి చెందిన ప్రముఖ కంపెనీ పెప్పర్ మోషన్ (Pepper Motion) చిత్తూరు జిల్లా పుంగనూరులో రూ. 4,640 కోట్లతో 800 ఎకరాల విస్తీర్ణంలో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది.
అతి త్వరలో భూమిపూజకు సిద్ధమవుతుంది. 2025కి వాణిజ్య ఉత్పత్తి మొదలయ్యేలా తరితగతిన పనులు చేపట్టనున్నారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ యూనిట్ ఏర్పాటు చేయబోతున్నారు.
ఏడాదికి 30,000 ఎలక్ట్రిక్ బస్సులు, ట్రక్కులు తయారీ సామర్థ్యంతో ఇంటిగ్రేటెడ్ వర్టికల్ ప్రొడక్షన్ ఫెసిలిటీని పెప్పర్ మోషన్ కంపెనీ ఏర్పాటు చేయనుంది. 20 జీడబ్ల్యూహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ తయారీ యూనిట్ ఇందులో ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ తయారయ్యే ఎలక్ట్రిక్ బస్సులు, ట్రక్కులకు ఈ-బ్యాటరీలు అమరుస్తారు. డీజిల్ బస్సులు, ట్రక్కులను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే రిట్రో ఫిట్టింగ్ వ్యవస్థ ఈ యూనిట్ మరో ప్రత్యేకత. పెప్పర్ మోషన్ కంపెనీ పుంగనూరులో ఏర్పాటు అవుతుండటంతో 8,100 మంది ఇంజినీర్లు, టెక్నీషియన్లకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతాయి. పరోక్షంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
అయితే ఇప్పటి వరకు జర్మనీ ప్రధాన కేంద్రంగా ఏర్పాటైన పెప్పర్ మోషన్ కంపెనీ.. యూరప్, యూఎస్ఏ, మెక్సికో, చైనాలో యూనిట్లను ఏర్పాటు చేసింది. ఈ యూనిట్లో ఏర్పాటుచేయనున్న గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా ఏషియా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా లాంటి దేశాల్లోని పెప్పర్ భాగస్వామ్యులకు కూడా ఇక్కడి నుంచే సేవలు అందిస్తామని పెప్పర్ మోషన్ కంపెనీ తెలిపింది. పెప్పర్ మోషన్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వ పూర్తి సహకారం అందించి అనుమతులు త్వరితగతిన మంజూరు చేసింది. సీఎం వైఎస్ జగన్ ప్రోత్సాహం, మౌలిక సదుపాయాలు చూసి ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చినట్లు పెప్పర్ మోషన్ సీటీవో డాక్టర్ మథియాస్ కెర్లర్ తెలిపారు.