‘కేంద్రంలో మళ్లీ అధికారం ఎన్డీఏదే. రాష్ట్రంలో కూటమి విజయం సాధిస్తుంది. చంద్రబాబు నాయుడు, మా తమ్ముడు పవన్ కళ్యాణ్ సిఫార్సుతో నేను ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ అయిపోతా. అనకాపల్లి ఎంపీ సీటు వదులుకున్నందుకు నేను పెద్ద పోస్టుకే వెళ్తా..’ అంటూ మెగా మిడిల్ బ్రదర్ కొణిదల నాగబాబు ఊహా లోకంలో తేలిపోతున్నట్లు తెలిసింది.
నాగబాబుకు మొదటి నుంచి రాజకీయంగా ఆకాంక్షలు ఎక్కువగానే ఉన్నాయి. కాకపోతే గతంలో పోటీ చేసి దారుణంగా ఓడిపోయాడు. ఈదఫా ఎన్నికల్లో ఎలాగైనా జనసేన నుంచి పోటీ చేయాలని ప్రయత్నించాడు. అనకాపల్లి ఎంపీగా బరిలో ఉండాలని తీవ్రంగా ప్రయత్నించాడు. కాకపోతే చంద్రబాబు సన్నిహితుడు సీఎం రమేష్ రాకతో ఆశలు అడియాశలయ్యాయి. అయితే భారీ మొత్తంలో డబ్బు ముట్టినట్లు చెబుతున్నారు. తిరుపతి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని నాగబాబు భావించాడు. కాకపోతే ఆ సీటును ఆరణి శ్రీనివాసులు అనే స్థానికేతరుడికి పవన్ అమ్మేశాడు. దీంతో మిడిల్ బ్రదర్ కొద్దిరోజులు అలిగాడు. పవన్ సర్దిచెప్పి పిఠాపురం బాధ్యతలు అప్పజెప్పాడు. కొద్దిరోజులుగా నాగబాబు ఇక్కడే మకాం పెట్టాడు. పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాను అడ్డం పెట్టుకుని పెత్తనం చేస్తున్నాడు. ఈయన కొద్దిరోజులుగా కొత్త పాట అందుకున్నారంట. అనకాపల్లి ఎంపీ సీటు వదులుకున్నందుకు నన్ను గవర్నర్‌ను చేస్తామని చంద్రబాబు, పవన్, సీఎం రమేష్ హామీ ఇచ్చారని ముఖ్యమైన నేతల వద్ద చెబుతున్నాడట. వాళ్లేమో ఈయనకు అంత సీన్ లేదని తెలుగు తమ్ముళ్లతో గుసగుసలాడుతున్నారు. గవర్నర్ పోస్ట్ ఉంటే జబర్దస్త్ జడ్జ్ పోస్ట్ అనుకుంటున్నట్టు ఉన్నాడు. యాడ దొరికిన సంతరా ఇదని నవ్వుకుంటున్నారు.
ఒకవేళ చంద్రబాబు సిఫార్సును కమలం పెద్దలు పట్టించుకోకపోయినా ఇబ్బంది లేదని, పవన్‌కు నరేంద్ర మోదీ, అమిత్‌షా, జేపీ నడ్డా బాగా తెలుసని, తప్పకుండా తనను గవర్నర్‌ను చేస్తాడని చెప్పుకొంటూ గాల్లో తేలిపోతున్నాడంట. వాస్తవానికి నాగబాబు అత్యంత వివాదస్పదమైన వ్యక్తి. గతంలో సేనాని వ్యవహారశైలినే విమర్శించి ప్రస్తుతం అతని పక్కనే తిరుగుతున్నాడు. చంద్రబాబు, లోకేశ్, బాలకృష్ణ, టీడీపీ నాయకులపై అడ్డదిడ్డంగా మాట్లాడిన సందర్భాలున్నాయి. గత ఎన్నికల సమయంలో తనతో సన్నిహితంగా ఉండే ఆర్టిస్టులతో వీడియోలు పోస్టు చేయించాడు. సబ్జెక్టు లేదు. నోటికి అడ్డూ అదుపు లేకుండా ప్రత్యర్థులను చులకనగా మాట్లాడి అభాసుపాలవుతుంటాడు. అన్నింటికి మించి డబ్బు మనిషి. జనసేనను అడ్డం పెట్టుకుని కోట్ల రూపాయలు సంపాదించాడు. ప్రతి చిన్న విషయానికి విరాళాలు సేకరించడం అలవాటు చేసుకున్నాడు. ఎన్నికల నేపథ్యంలోనూ పిఠాపురంలో పవన్ గెలుపు కోసమంటూ భారీగా డబ్బు వసూలు చేస్తున్నాడు. ప్రస్తుతం కాబోయే గవర్నర్‌ని బాగా చూసుకోండని జనసైనికులకు చెబుతున్నాడు. మెగా బ్రదర్స్ గురించి బాగా తెలిసిన వాళ్లు మాత్రం ఇతని తీరును చూసి నవ్వుకుంటున్నారు. ఇంతకీ తెలంగాణ గవర్నర్ అయితే మేలని, షూటింగ్ చేసుకుంటూ సలహాదారులుగా ఉంటామని హైపర్ ఆది, గెటప్ శ్రీను ఎక్కడా చెప్పడం లేదు కదా..