తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య సీట్ల అంశం కొలిక్కి వచ్చిందని ఎల్లో మీడియాలో వచ్చిన వార్తలపై కలత చెందిన కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు చేగొండి హరిరామజోగయ్య సోమవారం జనసేనాని పవన్ కళ్యాణ్‌కు మరో బహిరంగ లేఖ రాసి విడుదల చేశారు. ఇందులో ఆయన పవన్ తీరును ఎండగడుతూ ఘాటుగానే స్పందించారు. రాజ్యాధికారం సాధించడమంటే చంద్రబాబు నాయుడిని అధికారంలోకి తేవడమా అని ప్రశ్నించారు. సమావేశాల్లో మీరు ఏ విషయాలు చర్చించారు?, సేనకు తెలుగుదేశం అధినేత ఎన్ని సీట్లు కేటాయించడానికి సిద్ధపడ్డారు?, ఏ సీట్లు, అభ్యర్థులెవరు? తదితర విషయాలను వివరిస్తూ ఒక ఎల్లో టీవీ ఛానల్ 30 సీట్లని, ఒక ఎల్లో వార్తా పత్రిక 27 సీట్లని ప్రకటించాయి. ఇలా ఏకపక్షమైన వార్తలు పచ్చ మీడియా ఎవరిని ఉద్ధరించేందుకు ప్రకటించిందో ఆయా పార్టీల శ్రేణులే గ్రహించాలని హితవు పలికారు. జనసేన సపోర్టు లేకుండా టీడీపీ ఎన్నికల్లో ముందుకు వెళ్లలేదు. కనీసం 50 సీట్లయినా సేన తీసుకుంటే రాజ్యాధికారం పూర్తిగా కాకపోయినా పాక్షికంగానైనా దక్కే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. పవన్ అధికారమంతా చంద్రబాబుకే ధారపోయాలని చూస్తున్నారని విమర్శించారు. దీనిపై జన సైనికులు అడిగే ప్రశ్నకు ఎలా సమాధానం చెప్తారని ఆయన్ను నిలదీశారు. వాళ్లు సంతృప్తి పడేలా, సీట్లు పంపకంలో కాకపోయినా ముఖ్యమంత్రి పదవి మీకు రెండున్నరేళ్ల కట్టబెట్టబోతున్నట్లు ఎన్నికల ముందే చంద్రబాబు నోటి వెంట చెప్పించగలరా అంటూ పవన్‌పై జోగయ్య ప్రశ్నల వర్షం కురిపించారు. సీట్ల పంపకం జనసేన, తెలుగుదేశం మధ్య జనాభా నిష్పత్తి ప్రాతిపదికన జరగబోతున్నాయా?, బడుగు బలహీనవర్గాలకు సీట్ల కేటాయింపు ద్వారా రాజ్యాధికారం దక్కబోతోందా? సామాజిక న్యాయం జరగబోతుందా? ఇలా జోగయ్య సేనానికి అనేక వాటికి జవాబులు కావాలని అడిగారు.
పొత్తు పొడిచిన నాటి నుంచి జోగయ్య పవన్‌కు ప్రశ్నలు వేస్తూనే ఉన్నారు. అయితే సేనాని ఇంత వరకు సమాధానం చెప్పలేదు. ఎల్లో మీడియాలో వస్తోందంతా అబద్ధమని ఖండించనూ లేదు. తనకేం పట్టనట్లుగా ఉండిపోయారు. జోగయ్య తాజా లేఖ మీడియాలో వైరలైంది. ఇవన్నీ నిజాలేనని జన సైనికులు భావిస్తున్నారు. వారికి టీడీపీతో పొత్తు ఇష్టం లేకపోయినా పవన్ కోసం ఒప్పుకున్నారు. మరి ఆయనే డబ్బు కోసం చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తూ సేనకు ద్రోహం చేస్తుండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంతకీ పవనూ.. జోగయ్య ప్రశ్నల్లో ఒక్కదానికైనా సమాధానం చెప్పొచ్చుగా..