నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండుసార్లు హిందూపురం ఎమ్మెల్యేగా గెలుపొందిన బాలకృష్ణమూడోసారి గెలిచి హ్యాట్రిక్ నమోదు చేయాలని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే బాలకృష్ణకు పరిపూర్ణనంద టెన్షన్ పట్టుకుంది. హిందూపురం గెలుపు అవకాశాలకు గండి కొట్టేలా పరిపూర్ణనంద స్వామి వ్యూహాలు రచిస్తూ ఉండటం బాలకృష్ణకు మింగుడు పడటం లేదు.
నిజానికి టీడీపీ,జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా పరిపూర్ణనంద స్వామికి హిందూపురం ఎంపీ టికెట్ కేటాయిస్తారనే ప్రచారం జరిగింది. అందుకు అనుగుణంగానే పరిపూర్ణనంద స్వామి హిందూపురం నియోజకవర్గంలో కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. కానీ చివరి నిమిషంలో బాలకృష్ణ ఒత్తిడి వల్లనే హిందూపురం ఎంపీ సీటు బీజేపీకి కాకుండా టీడీపీకి దక్కిందని పరిపూర్ణనంద స్వామి భావిస్తున్నారు. 100 శాతం తనకి దక్కాల్సిన సీటు పార్థసారథికి దక్కడం వెనుక బాలకృష్ణ హస్తం ఉందని పరిపూర్ణనంద స్వామి గుర్రుగా ఉన్నారు.
కాగా హిందూపురం ఎంపీ సీటులో బీజేపీ అభ్యర్థిని నిలబెడితే మైనారిటీ, క్రిస్టియన్ ఓటర్లు హిందూపురంలో టీడీపీకి దూరం అయ్యే ప్రమాదం ఉందని పైగా గుర్తుల విషయంలో కూడ గందరగోళం ఏర్పడి తాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హిందూపురంలో తన విజయావకాశాలు దెబ్బతింటాయని భావించి ఎంపీ సీటును పరిపూర్ణనంద స్వామికి దక్కకుండా బాలకృష్ణ రాజకీయం చేశాడని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో బాలకృష్ణను ఎలాగైనా ఓడించి తీరాలన్న సంకల్పంతో పరిపూర్ణనంద స్వామి హిందూపురం అసెంబ్లీలో బాలకృష్ణకు పోటీగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీకి సై అంటున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన పరిపూర్ణనంద స్వామి, తనకు సీటు దక్కకుండా చేసిన బాలకృష్ణకు ఓటమి రుచి చూపించేలా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవడానికి వ్యూహాలు రచిస్తున్నారు. పరిపూర్ణనంద స్వామి ఎదురు తిరగడంతో పాటు హిందూ సోదరులంతా తన వెంట నడవాలని పరిపూర్ణనంద స్వామి చేస్తున్న ప్రచారంతో బాలకృష్ణలో ఓటమి భయం పట్టుకుందని పొలిటికల్ సర్కిల్స్ లో వినబడుతున్న మాట..