కొందరి లాయర్ల తీరుపై ఏపీ హైకోర్టు మండిపింది. చర్యలు తీసుకోవాలని రాష్ట్ర బార్ కౌన్సిల్, బీసీఐలకు ఆదేశాలిచ్చింది. ఏపీ భూ యాజమాన్య హక్కుట చట్టాన్ని కొందరు న్యాయవాదులు వ్యతిరేకిస్తున్నారు. దీని వెనుక రాజకీయ పార్టీల దురుద్దేశం ఉందని ఆరోపణలున్నాయి. వారి స్క్రిప్ట్ ప్రకారం విధులు బహిష్కరించి నిరసన కార్యక్రమాలు చేపట్టారని లాయర్లలోని మరో వర్గం విమర్శిస్తోంది. ఈ క్రమంలో సమ్మె చేస్తున్న వారిపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్టం విషయంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా సమ్మె కొనసాగించడాన్ని తప్పుపట్టింది. విరమించాల్సిందేనని స్పష్టం చేసింది. న్యాయవాదుల ప్రయోజనాలను పరిరక్షిస్తూ ఉత్తర్వులిచ్చినా జిల్లాల్లో ఆందోళన చేయడం ఎందుకని ప్రశ్నించింది.
చట్టాన్ని వ్యతిరేకిస్తూ కోర్టులో కొందరు పిల్స్ వేశారు. వీటిపై విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం ప్రభుత్వం పలు విషయాలను ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లింది. ప్రస్తుతం రీసర్వే ప్రక్రియ జరుగుతోందని, భూ యాజమాన్య హక్కుల చట్టం అమలుకు మరింత సమయం పడుతుందని చెప్పింది. పూర్తి వివరాలతో కౌంటర్ వేసేందుకు సమయం కోరారు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది వేలూరి మహేశ్వరరెడ్డి. ఇదిలా ఉండగా సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా పలువురు లాయర్లు సమ్మె చేస్తున్నారని, దీంతో కక్షిదారులు ఇబ్బందులు పడుతున్నారంటూ పిల్ దాఖలు కాగా ధర్మాసనం విచారించి కీలక వ్యాఖ్యలు చేసింది. సమ్మె విషయంలో మీ పాత్ర ఏమిటంటూ బార్ కౌన్సిల్ను ప్రశ్నించింది. ఈ సందర్భంగా అనేక ప్రశ్నలు వేసింది. మొత్తంగా వెంటనే సమ్మె విరమించాలని ఆదేశించింది.