జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు చేగొండి హరిరామజోగయ్య శనివారం మరో లేఖ రాశారు. తెలుగుదేశంతో పొత్తు నేపథ్యంలో ఏమి చేయాలో చెబుతూ ఇప్పటికే పలుమార్లు ఆయన లేఖలు రాసి మీడియాకు విడుదల చేశారు. జోగయ్య మాటలను పవన్ పరిగణలోకి తీసుకుంటే పొత్తుల వ్యవహారం వేరేలా ఉండేది. అయితే చంద్రబాబు చెప్పినట్లుగా నడుచుకుంటుండటంతో ఆ లేఖలకు జనసేనాని విలువ ఇవ్వడంలేదని అర్థమవుతోంది. పొత్తులో టీడీపీతో సమాన స్థాయిలో సేన ఉండాలని చేగొండి ఆశ. జనసేనికులది కూడా అదే. కానీ బాబు అండ్ కో సేనను చాలా చిన్న పార్టీగా చూస్తున్నారనేది వాస్తవం.
తాజా లేఖలో..
2014 ఎన్నికల్లో జనసేన పార్టీ టీడీపీకి మద్దతు ఇవ్వడం, ఎవరినీ పోటీకి పెట్టకపోవడంతో చట్టసభలో అడుగుపెట్టే అవకాశం లేకుండాపోయింది. 2019కి వచ్చేసరికి 137 సీట్లలో పోటీ చేసినా చట్టసభలో ప్రాతినిధ్యం వహించే చాన్స్ రాలేదు. అప్పుడు నిలబడిన అభ్యర్థుల్లో చాలామంది 2024లో బరిలో ఉండాలని ఉవ్విళూరుతున్నారు. అయితే టీడీపీ స్వల్పంగా సీట్లు కేటాయిస్తుందని ప్రచారం జరుగుతోంది. దీంతో ఆశావహులు, పవన్‌ను సీఎంగా చూడాలనుకుంటున్న సేన కార్యకర్తలు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. తెలుగుదేశం తమ నాయకులకు ఎక్కువ సీట్లు కేటాయించుకోవాలని చూస్తున్నట్లు ఎల్లో మీడియాలో వస్తున్న వార్తలను బట్టి తేటతెల్లమవుతోంది. కొన్ని పత్రికలు, ఛానల్స్ సేనకు 15 నుంచి 25 సీట్లు, మరికొన్ని 28 సీట్లని చెబుతున్నాయి. జనసేనను తక్కువగా చూపి తక్కువ స్థానాలకే పరిమితం చేయాలని వాళ్లంతా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ సేనను వాడుకుని వదిలేస్తుందన్న ప్రచారం క్షేత్రస్థాయిలో బలంగా ఉంది. గౌరవప్రదమైన సీట్లు కేటాయించకుండా అవమానిస్తుందనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లొచ్చు. పొత్తు సక్రమంగా లేకపోతే మరోసారి జగన్ గెలుస్తాడు. అందువల్ల సేనకు అధిక సీట్లు కేటాయించాలి. లేకపోతే ఓట్లు ట్రాన్స్ఫర్ కావనే విషయాన్ని టీడీపీ పెద్దలు గుర్తుంచుకోవాలి. చంద్రబాబు జనసేనను పట్టించుకోకుండా మండపేట, అరకు అభ్యర్థులను ప్రకటించడం చాలా పెద్ద తప్పు. ఇందుకు పవన్ రాజోలు, రాజానగరం స్థానాల్లో చేస్తామని చెప్పడం జన సైనికులకు సంతృప్తినివ్వలేదు. ఎందుకంటే పశ్చిమగోదావరి జిల్లాలోని ఉండి, ఉంగుటూరు, తణుకు, నిడదవోలు స్థానాల్లో సేన పోటీ చేస్తుందని ప్రకటించి ఉంటే పవన్‌కు ఎంత నిబద్ధత ఉందో, పొత్తులో ఆయన స్థాయి ఏంటో బయటపడేది. తక్కువ సీట్లు కేటాయిస్తే జనసైనికులు ఒప్పుకోరు. పవన్ ఇప్పటి వరకు చెప్పిన మాటలకు అర్థం ఉండదు. 2019 ఎన్నికల్లో పదివేల ఓట్లు దాటిన జనసేన అభ్యర్థులు 60 వరకు ఉన్నారు. నేడు అన్ని విధాలుగా బలమైన అభ్యర్థులు 50 అసెంబ్లీ స్థానాల్లో, ఆరు పార్లమెంట్ సీట్లలో ఉన్న మాట నిజం. ఈ మేరకు కేటాయింపులు జరిగితే జనసైనికులు సంతృప్తి చెంది ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతాయి. టీడీపీ మనుగడలో ఉండాలంటే వచ్చే ఎన్నికలు వారికే చాలా అవసరం. ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి.
అంతా బాబు ఇష్టం
పవన్‌కు జోగయ్య బాగా చురకలు అంటించారు. అవసరమైన సీట్లు కాకుండా వేరేవి ప్రకటించిన పొత్తులో ఆయన పాత్ర ఎంతో చెప్పకనే చెప్పేశారని అభిప్రాయపడ్డారు. ఎల్లో మీడియా జనసేనను తక్కువ చేసి చూపుతోందని వారిపై కూడా మండిపడ్డారు. పవన్‌పై అటు జోగయ్య, ఇటు జనసైనికులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారనేది నిజం. ఎందుకంటే జనసేనాని సీఎం కావాలి. ఇదే వారి కోరిక. కానీ అది సాధ్యం కాదని నారా లోకేశ్, పవన్ మాటలతో తేలిపోయింది. కనీసం సీట్ల విషయంలో అయినా గట్టిగా ఉండాలని జోగయ్య, సేన కార్యకర్తలు పట్టుబడుతున్నారు. కానీ పవన్‌కు చంద్రబాబు మాటే వేదం. ఆయన ఏమి చెబితే అదే చేస్తాడు. నిజానికి టీడీపీ చర్యను నిరసిస్తూ సీట్లు ప్రకటించాడని అందరూ భావించారు. అయితే అది కూడా బాబును అడిగే పవన్ చెప్పి ఉంటాడని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. హరిరామజోగయ్య ఇంకో 30, 40 లేఖలు రాసినా ఉపయోగం ఉండదు. బాబు ఎన్ని సీట్లు ఇచ్చినా తీసుకోవాలి. ఎక్కడ పోటీ చేయమంటే అక్కడే చేయాలి. ఇది బహిరంగ రహస్యం.