చెప్పులోన రాయి చెవిలోన జోరీగ
కంటిలోని నలుసు కాలి ముల్లు
ఇంటిలోని పోరు నింతింతగాదయా..
విశ్వదాభిరామ వినురవేమ..
ఈ పద్యం ఇప్పుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు సరిగ్గా సరిపోతుంది. ఏ ముహూర్తాన తెలుగుదేశంతో పొత్తు ప్రకటించాడో గానీ.. పవన్‌ను కాపు సంక్షేమసేన అధ్యక్షుడు హరిరామజోగయ్య లేఖలతో చెడుగుడు ఆడుకుంటున్నాడు. ఎన్ని స్థానాలో తీసుకోవాలో చెప్పాడు. ఎక్కడెక్కడ పోటీ చేయాలో అభ్యర్థుల లిస్ట్‌తో సహా ఇచ్చాడు. వీటినే ఏమి చేయాలో తెలియక పవన్ ఆగ్రహంతో ఊగిపోతోంటే శనివారం మరో లేఖ విడుదలైంది. ఆర్థికంగా బలంగా ఉన్న కాపు, తూర్పు కాపులకు 40 సీట్లు తీసుకోవాలి. మరో 23 ఇతర కులాల వారి కోసం అడగాలి.
జోగయ్య లేఖ ప్రకారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏకంగా 63 అసెంబ్లీ సీట్లను జనసేనకు ఇవ్వాలి. అసలు పొత్తే ఇష్టం లేని తెలుగు తమ్ముళ్లు త్యాగాలు చేసే పరిస్థితి ఎంత మాత్రం లేదు. ఇప్పటికే టికెట్ల కోసం గొడవలు జరుగుతున్నాయి. అధినేతకు అల్టిమేటాలు జారీ చేస్తున్నారు. రోజులు గడుస్తున్నా భారతీయ జనతా పార్టీ పొత్తు గురించి తేల్చలేదు. అది ఏ విషయం చెబితేనే సీట్లపై క్లారిటీ వస్తుంది. పైగా కమలం పెద్దలు తమకు ఎక్కువ సీట్లు కావాలని అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో జోగయ్య అభ్యర్థుల పేర్లతో సహా రాస్తున్న లేఖలు టీడీపీలో కలకలం రేపుతున్నాయి. అసలు పవన్ రాజీపడిపోయి 22 అసెంబ్లీ, మూడు ఎంపీ సీట్లకు ఓకే చెప్పాడని ప్రచారం కూడా జరుగుతోంది. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అయితే గోదావరి జిల్లాల్లో సేనకు 7 నుంచి 8 సీట్లు మాత్రం టీడీపీ ఇస్తుందని తేల్చేశాడు. ఈయన టీడీపీ మౌత్‌పీస్ కాబట్టి నిజమే రాసుంటాడని పొత్తులోని పార్టీల నేతలు భావిస్తున్నారు.
బాబు అతి తెలివి
అసలు చంద్రబాబు జనసేనను వాడుకుంటోంది కాపు ఓట్ల కోసం. లేకపోతే కనీసం పట్టించుకోడు కూడా. ఆ విషయం పవన్‌కు కూడా బాగా తెలుసు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీ పొత్తు నుంచి బయటకు వచ్చిన సందర్భంలో పవన్ బాబు వెన్నుపోటు రాజకీయాల గురించి చెప్పాడు. అయినా మళ్లీ ఆయన ఒడిలో వాలిపోయాడు. సేనను తక్కువ సీట్లకు పరిమితం చేయాలనేది బాబు ప్రధాన ఆలోచన. అందుకు తగ్గట్లే ఎల్లో మీడియాలో కథనాలు రాయిస్తున్నాడు. చాలా తెలివిగా రాధాకృష్ణ పత్రికలో సీట్లను ప్రకటిస్తున్నాడు. ఎక్కడో కొన్ని సీట్లు మాత్రం సేనకు అవకాశం ఇచ్చి తెలుగు తమ్ముళ్ల నుంచి సహకారం అందించకుండా జనసైనికులను ఓడించాలనేది నారా వారి ప్రయత్నం. ఆ దిశగానే అడుగులు పడుతున్నాయి. సీట్లు తక్కువ ఇస్తాడని, కుట్రలు పన్నుతాడని తెలిసినా పవన్ తెలుగుదేశం కబంధహస్తాల్లో నుంచి బయటకు రాలేకపోతున్నాడు. ఇదే కాపు సామాజికవర్గంలోని కొందరికి కోపం తెప్పిస్తోంది. ఈ క్రమంలో కాపులు బలం పుంజుకోవాలంటే ఎక్కువగా సీట్లు తీసుకోవాలని జోగయ్య చెబుతున్నాడు.
అసలు సేనకు చంద్రబాబు 25 స్థానాలు ఇవ్వకపోవచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఎన్ని ఇచ్చినా మహాప్రసాదంలా కళ్లద్దుకుని తీసుకుంటానని పవన్ రాజీకెళ్లారు. ఈ సమయంలో జోగయ్య లేఖలతో సేనానిలో అసహనం పెరుగుతోంది. లేఖలకు సమాధానం ఇవ్వకపోయినా.. ఆ పెద్దాయన అంచనాలకు సీట్లు తగ్గినా కాపుల్లో వ్యతిరేకత వచ్చి ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందనే భయం ఓ వైపు వెంటాడుతోంది. అసలు కాపుల సపోర్ట్ లేకపోతే పవన్ జీరో అయిపోతాడు. జోగయ్య రోజుకో లేఖ రాస్తూ.. ఒక్కో డిమాండ్ తెరపైకి తెస్తూ నా రాజకీయ జీవితాన్ని నడిరోడ్డుపైకి తెచ్చాడని సన్నిహితుల వద్ద సేనాని వాపోతున్నాడు. మొత్తానికి కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు కాటమ రాయుడికి చెప్పులోన రాయి.. చెవిలోన జోరీగ.. కంటిలోని నలుసు.. కాలి ముల్లులా మారి 70 ఎంఎంలో సినిమా చూపిస్తున్నాడు.