ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే మెగా డిఎస్సీ కి త్వరలో నోటిఫికేషన్ ఇస్తున్న నేపథ్యంలో టెట్( టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) నోటిఫికేషన్ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. 2022 -2023 కాలంలో బీఈడీ, డీఈడీ పూర్తిచేసుకున్న అభ్యర్థులుకు మెగా డిఎస్సీ నోటిఫికేషన్ లో అవకాశం కల్పించాలనే సదుద్దేశంతో టెట్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ టెట్ నోటిఫికేషన్ ద్వారా 5 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని ప్రభుత్వం తెలిపింది. 2022 ఆగస్ట్ లో టెట్ నోటిఫికేషన్ ద్వారా 4.50 లక్షల మంది దరఖాస్తు చేసుకొని పరీక్ష రాస్తే 2 లక్షల మంది అర్హత సాధించారు.
టెట్ పరీక్ష రాసే అభ్యర్థులకు మేలు చేకూర్చే విధంగా నిబంధనలను సడలించిన పాఠశాల విద్యశాఖ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులుకు టెట్ పేపర్ -2ఏ రాసేందుకు డిగ్రీ లో 50 శాతం మార్కులు తప్పనిసరన్న నిబంధనను సవరించి, 40 శాతం మార్కులు అర్హత ఉంటే చాలు అని తెలిపింది. తద్వారా ఎక్కువ మంది విద్యార్థులకు టెట్ రాసే అవకాశం ఉంటుంది. ఇతర వర్గాలకు మాత్రం 50 శాతం మార్కులు ఉండాలని పేర్కొంది.