చంద్రబాబు హయాంలో దయనీయస్థితిలోకి చేరిన సూక్ష్మ సేద్యం వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా దేశంలోనే 4వ స్థానానికి చేరింది. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా పార్లమెంట్లో వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో 9.10 లక్షల హెక్టార్లలో రైతులు సూక్ష్మ సేద్యంచేస్తున్నారని, పర్ డ్రాప్ మోర్ క్రాప్ (పీడీఎంసీ) పథకం కింద దేశం మొత్తంలో ఏపీలో10.96 శాతం మేర సూక్ష్మ సేద్యం సాగుతోందని అర్జున్ ముండా ప్రకటించారు.
చంద్రబాబు ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేయడంతో సూక్ష్మ సేద్యం చేసే చిన్న, సన్నకారు రైతులకు రూ.969.40 కోట్లు ఎగ్గొట్టింది. దీంతో బిందు, తుంపర సేద్యం చేసే రైతులు దయనీయ స్థితిలోకి వెళ్లారు. కాగా ముఖ్యమంత్రిగా జగన్ పదవీ బాధ్యతలు స్వీకరించగానే ప్రధానంగా వ్యవసాయ రంగం అభివృద్ధిపై దృష్టి సారించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సన్న, చిన్నకారు రైతులకు 90 శాతం రాయితీపై తుంపర, బిందు సేద్యం పరికరాలను అందిస్తున్నారు. రైతులకు మరింత మేలు కలిగేలా ఈ పరికరాలపై జీఎస్టీ భారం రైతులపై పడకుండా ఆ మొత్తాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. దాదాపు రూ.60 కోట్లకు పైగా జీఎస్టీని వైయస్ జగన్ ప్రభుత్వమే భరించింది. దానితో పాటు చంద్రబాబు ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ. 969.40 కోట్లను జగన్ సర్కారు చెల్లించింది.
వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేలా వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలనివ్వడంతో ఏపీలో సూక్ష్మ సేద్యం రాష్ట్రంలో ఊపందుకొని దేశంలో నాలుగో స్థానానికి చేరింది. సూక్ష్మ సేద్యంలో దేశంలో కర్ణాటక, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలు మొదటి మూడు స్థానాల్లో ఉండగా ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానాన్ని పొందింది.