ఫిలిం సిటీలో 15 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేయడం.. 15 సంవత్సరాలుగా బలహీన వర్గాలకు చెందాల్సిన భూములను రామోజీ తన అధీనం లో ఉంచుకోవడంపై ప్రశ్నిస్తూ.. మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు రామోజీకి బహిరంగ లేఖ రాశారు.
గోనె ప్రకాశరావు రామోజీని బహిరంగ లేఖతో సూటిగా ప్రశ్నిస్తూ.. పదిహేను సంవత్సరాలుగా బలహీన వర్గాలకు చెందాల్సిన భూములు మీ అధీనంలోనే ఉన్నాయి. నాగన్‌పల్లి గ్రామంలో సర్వే నెంబర్ 189, 203 కింద 14 ఎకరాల 30 గుంటల భూమిని దివంగత సీఎం వైఎస్సార్ బలహీన వర్గాలకు కేటాయించారు.. కానీ మీ రాజకీయ పలుకుబడితో 15 ఏళ్లుగా పేదల భూమిని ఆక్రమించారు. ప్రభుత్వ రహదారిని రామోజీ ఫిలిం సిటీ కింద ఆక్రమించారు. అనాజ్ పూర్ నుండి ఇబ్రహీంపట్నం వరకు 13 కి.మీ ప్రభుత్వ రహదారి ఆక్రమించారు. దాని వల్ల కోహెడ ,ఇబ్రహీంపట్నం వెళ్ళటానికి దూరం పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మీరు ప్రభుత్వ రహదారిని ఆక్రమించడం వల్ల 16 గ్రామాల్లోని 90 వేల మంది ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. అంటూ నిలదీశారు. ఈ బహిరంగ లేఖ ద్వారా ప్రజల పక్షాన అడిగే ప్రశ్నలకు రామోజీ సమాధానం చెప్పాలంటూ ప్రకాశ్‌రావు డిమాండ్ చేశారు. రాష్ట్రానికే మార్గదర్శకులుగా చెప్పుకునే మీరు ఈ ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పగలరా అంటూ ప్రశ్నించారు.
ప్రజా రహదారిని కబ్జా చేయటాన్ని మీరెలా సమర్ధించుకుంటారు?. మీరు ప్రజా రహదారులను కబ్జా చేయటం వల్ల విద్యార్థులు ఇబ్బందులకు గురి అవుతున్నారు. ప్రభుత్వ రహదారులు మీ ఎస్టేట్ కాదు. మీ సామ్రాజాన్ని సామాన్యులు చూడకూడదు అనుకుంటే భారీ ప్రహరీలు నిర్మించుకోండి. అంతే కానీ అటువైపు ప్రజలు రాకూడదని ప్రభుత్వ రహదారులు ఆక్రమించటం ఏమిటని గోనె ప్రకాశరావు ప్రశ్నించారు.
రామోజీకి 2024 మార్చి 31 వరకు డెడ్ లైన్. ఆలోపు ప్రభుత్వ భూములు తిరిగి ఇచ్చేయాలని.. ఈ విషయం పై సీఎం రేవంత్ రెడ్డికి మెమోరాండం ఇస్తానని.. రామోజీ భూములు అప్పగించకపోతే బుల్డోజర్లు పెట్టి రామోజీ ఫిల్మ్ సిటీ గోడలు కూలుస్తానంటూ గోనె ప్రకాశరావు హెచ్చరించారు.