ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కూటమికి షాక్ కలిగే వార్త బయటకు వచ్చింది. ఎన్నికల కమీషన్ జనసేన పార్టీ సింబల్ గాజు గ్లాసును ఫ్రీ సింబల్ జాబితాలో పెట్టడంతో ఇప్పుడు టీడీపీ, జనసేన , బీజేపీ కూటమిని కలవరానికి గురి చేస్తుంది. పొత్తులో భాగంగా జనసేన 21 అసెంబ్లీ, రెండు లోక్ సభ స్థానాల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా జనసేన పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో కాకుండా ఇతర నియోజకవర్గాల్లో గాజు గ్లాస్ సింబల్ ఫ్రీ సింబల్ జాబితాలో ఉండటంతో కూటమి నేతలు అయోమయానికి గురవుతున్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందని పార్టీలకు సంబంధించిన గుర్తును ఫ్రీ సింబల్ పెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘ గుర్తింపు లేకపోవడం ఇప్పుడు కొత్త సమస్యను తీసుకొచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు కేవలం 5.53% శాతం ఓట్లు మాత్రమే సాధించడంతో జనసేనకు కేంద్ర ఎన్నికల సంఘ గుర్తింపు రాలేదు. దీంతో టీడీపీ, బీజేపీ అభ్యర్థులున్న నియోజకవర్గాల్లో కూడా స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించే అవకాశం ఉంది. ఇప్పటికే జగ్గంపేట జనసేన రెబల్ అభ్యర్ది సూర్యచంద్రకు, విజయనగరంలో టీడీపీ రెబల్ అభ్యర్థి మాజీ ఎమ్మేల్యే మీసాల గీతకు గాజు గ్లాసు గుర్తు కేటాయించడంతో కూటమికి తలనొప్పిగా తయారైంది.
ఒకవేళ గాజు గ్లాసు సింబల్ స్వతంత్ర అభ్యర్థులకు కేటాయిస్తే అక్కడ ఓటర్లు అయోమయానికి గురై గాజు గ్లాసుకు ఓట్లేసే అవకాశం ఉందని తద్వారా తమకు పడాల్సిన ఓట్లు చీలిపోతాయని కూటమి నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తాము 10 శాతానికి పైగా సీట్లల్లో పోటీ చేస్తున్నామని జనసేన ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లింది కానీ సానుకూలంగా ఫలితం రాలేదు. దీంతో తమ గ్లాసు గుర్తు తమకే గుచ్చుకోనుందని కూటమి నేతలు తలలు పట్టుకుంటున్నారు.