ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైఎస్సార్సీపీలోకి పలువురు కీలక నేతలు చేరుతున్నారు. తాజాగా మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. సీఎం జగన్ కండువా కప్పి ఆయనను ఆయన సతీమణి శాంతి జ్యోతిని పార్టీలోకి ఆహ్వానించారు.
గతంలో ఐఆర్టీఎస్ అధికారిగా పనిచేసిన రావెల కిషోర్ బాబు 2014లో టీడీపీ తరపున గుంటూరు ప్రత్తిపాడు(ఎస్సీ) నియోజకవర్గంనుండి గెలిచారు. టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన రావెల 2018 చివర్లో టీడీపీ నుండి జనసేనలో చేరడం గమనార్హం. కాగా పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు సీఎం జగన్ చేస్తున్న సేవ తనను ఆకట్టుకుందని తెలిపిన రావెల అంబేద్కర్ ఆశయాల్ని నెరవేరుస్తున్న ఏకైక నాయకుడు సీఎం జగన్ అని ప్రశంసించారు. జగన్ ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నానని పార్టీకి విధేయుడిగా ఉంటానని రావెల కిషోర్ వెల్లడించారు. ఈ సందర్భంగా జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, ప్రత్తిపాడు వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త బాలసాని కిరణ్ కుమార్ పాల్గొన్నారు.
అదేవిధంగా సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ సమక్షంలో మాజీ ఐఆర్ఎస్ అధికారి చుక్కా విల్సన్ బాబు తన కుటుంబ సభ్యులతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మెచ్చి తాను పార్టీలో చేరినట్లు చుక్కా విల్సన్ బాబు వెల్లడించారు.