2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ బీజేపీజనసేనలు కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారంలో జోరుగా ఉంటే కూటమిలో మాత్రం ఇంకా సయోధ్య కుదరలేదు. టీడీపీలో మాత్రం నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంటే, టీడీపీ వాళ్ళు జనసేన వారిని అసలు గుర్తించడం లేదు. టీడీపీలో టికెట్ దక్కని నేతలు ఏదో ప్రచారం చేయాలన్నట్లు చేస్తున్నారు. జనసేన పార్టీ నేతలకు అడుగడునా అవమానాలే ఎదురవుతున్నాయి.
నంద్యాల జిల్లాలో కోట్ల వర్గం, ధర్మవరం సుబ్బారెడ్డి వర్గం మధ్య నువ్వా..నేనా? అనే రీతిలో ఆధిపత్యపోరు నడుస్తోంది. ప్యాపిలి మండలం పెద్ద పూజార్లలో ఏకంగా రాళ్లతో దాడి చేసుకునే వరకు వెళ్లింది. టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డికి మా వర్గం ముందు దండ వెయ్యాలి అంటే, మా వర్గం ముందు దండ వేయాలి అని ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. ఎంత సముదాయించినా ఎవరూ వినకపోవడంతో దీన్ని తట్టుకోలేక కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి కారు ఎక్కి అక్కడి నుంచి వెనక్కి వెళ్లిపోవాల్సి వచ్చింది.
ఇటీవల దెందులూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ జనసేన నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు ఇష్టం అయితే మాతో ప్రచారం చేయండి. మీరు మీరు గొడవలుపడేట్లు ఉంటే మీరు ప్రచారానికి రావాల్సిన అవసరం లేదని. ఈ విధంగా మాతో పని చేయక్కర్లేదని చింతమనేని వ్యాఖ్యానించారు. మీ పార్టీలో ఏదైన సమస్య ఉంటే జనసేన జిల్లా అధ్యక్షుడు దగ్గర తేల్చుకోవాలని చింతమనేని జనసేన నేతలకు హితవు పలికారు.
ఇది మరువక ముందే ఇలాంటి ఘటన మరొకటి చోటు చేసుకుంది. విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గంలో జనసేన పార్టీ నేతలకు ఘోర అవమానం ఎదురైంది. టీడీపీ ప్రచార రథంపై నుంచి జనసేన నేతలను బలవంతంగా గెంటేశారు. గల్లాలు పట్టి కిందకు లాగేశారు టీడీపీ నేతలు. టీడీపీ ప్రచార రథంపై జనసేన జెండాలు లేకుండా ప్రచారం చేయడాన్ని జనసేన పార్టీ శ్రేణులు ప్రశ్నించాయి. ఎన్నికలకు పది రోజులు కూడా లేని సందర్భంలో నేతల మధ్య సమన్వయం కుదరకపోవడంతో ఏం చేయాలో తెలీక ఇరు పార్టీల నేతలు తలలు పట్టుకుంటున్నారు.