ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ పాలనలో దేవాదాయశాఖ బలోపేతం జరిగిందని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ స్పష్టం చేసారు. విజయవాడలో శనివారం ధార్మిక పరిషత్ సమావేశం తర్వాత విలేఖరుల సమావేశంలో మాట్లాడిన కొట్టు సత్యనారాయణ కీలక విషయాలు వెల్లడించారు.
గత ప్రభుత్వ పాలనలో కేవలం 1,621 ఆలయాలకు మాత్రమే డీడీఎన్ఎస్(ధూపదీప నైవేద్యాలు) పథకం ఉండేదని కానీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక పదివేల ఆలయాలకు డీడీఎన్ఎస్ పథకాన్ని విస్తరించారు. సీజీఎఫ్, శ్రీవాణి ట్రస్టు నిధులతో రూ.కోట్ల రూపాయలు వెచ్చించి ప్రముఖ ఆలయాలను ఆధునీకరిస్తున్నారు. అంతేకాకుండా అర్చకులకు వంశపారంపర్య అర్చకత్వపు హక్కు కల్పిస్తున్నారు. శ్రీశైలం పరిధిలోని 45 దేవాలయాల్లో కంచికామకోటి, పుష్పగిరి, కాశీ పీఠాధిపతుల నేతృత్వంలో ఏకకాలంలో మహా కుంభాభిషేకాలు నిర్వహించి చరిత్రలో నిలిచిపోయే సంఘటనకు శ్రీకారం చుట్టారని కొట్టు సత్యనారాయణ మీడియా సమావేశంలో తెలిపారు.
పేదల పక్షాన నిలిచేందుకు సిద్ధం అని వైసీపీ చెబుతుండగా టీడీపీ, జనసేన కూటమి దేనికి సిద్ధమో తెలపాలని కొట్టు సత్యనారాయణ డిమాండ్ చేశారు. టీడీపీ జనసేన కూటమి తోలి జాబితా వల్ల ఇరు పార్టీల కార్యకర్తల్లో అభద్రతా భావం ఏర్పడిందని, కూటమి ప్రకటించిన అభ్యర్థుల జాబితా హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.