సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈసీ (ఎలక్షన్ కమిషన్) ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా అధికారుల బదిలీలు జోరుగా జరుగుతున్నాయి. శుక్రవారం 92 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. సొంత జిల్లాలు, ఈ ఏడాది జూన్ నాటికి ఒకేచోట మూడేళ్ల సర్వీస్ పూర్తయ్యే వారిని బదిలీ చేస్తున్నట్లు ఆమె తెలిపారు. అలాగే 600 మంది తహసీల్దార్లు బదిలీ కానున్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు నేడో, రేపో రానున్నాయి. జోన్ల పరిధిలోనే పక్క జిల్లాలకు అధికారులను పంపనున్నారు. జాబితాను ఇప్పటికే భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయం ఎన్నికల సంఘానికి పంపింది. మరోవైపు పోలీసుల్లో డీఎస్పీ, సీఐ, ఎస్సైల బదిలీలు కొనసాగుతున్నాయి. శుక్రవారం ఎంపీడీఓలను బదిలీ చేశారు.
ఎన్నికల నిర్వహణకు ఈసీ వేగంగా అడుగులు వేస్తోంది. ఏర్పాట్లలో భాగంగా ఇప్పటికే కలెక్టర్లు, ఎస్పీలతో పలు దఫాలు సమావేశాలు నిర్వహించారు. జిల్లాస్థాయిలోనూ కలెక్టర్ సమావేశాలు జరిపి పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లపై యంత్రాగానికి దిశానిర్దేశం చేశారు. ఓటర్ల జాబితా విడుదలైన విషయం తెలిసిందే. అధికారులు రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. మొత్తంగా రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది. రాజకీయ పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి.