రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు ఈసీ వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఓ వైపు అధికారుల బదిలీలు చివరి దశకు చేరుకోగా.. మరోవైపు శాంతిభద్రతలపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఎలక్షన్ కమిషన్ ఆదేశాలతో ఉన్నతాధికారులు జిల్లాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల విభాగాలను ప్రారంభిం సీఐ, ఎస్సై, కానిస్టేబుళ్లను నియమించారు. రౌడీషీటర్లు, ట్రబుల్ మాంగర్స్, గత ఎన్నికల కేసుల్లో ఉన్న వారి బైండోవర్ ప్రక్రియ కొనసాగుతోంది. లైసెన్స్డ్ ఆయుధాలను డిపాజిట్ చేసుకుంటున్నారు. సమాచార వ్యవస్థను పటిష్టం చేసుకోవడానికి గ్రామాలను సందర్శించి సభలు పెట్టాలని నిర్ణయించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలున్న చోట భద్రతను మరింత కట్టుదిట్టంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు.
రాష్ట్రంలోకి అక్రమ రవాణాను అరికట్టేందుకు సరిహద్దుల్లో చెక్‌పోస్టులను పెంచుతున్నారు. 46 ఉండగా ఆ సంఖ్యను 139కి పెంచారు. ప్రభుత్వ ఆదేశాలతో మరో 15 ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వీటిలో పోలీస్, సెబ్, అటవీ శాఖ, జీఎస్టీ, రవాణా శాఖ, వీటితో కలిపి ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టులున్నాయి. తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, యానాం నుంచి నగదు, మద్యం రవాణాను అడ్డుకునేందుకు ఇవి ఎంతో ఉపయోగపడుతాయి. ఇంకా దొంగ ఓటర్లు రాష్ట్రంలోకి రాకుండా కఠినంగా వ్యవహరిస్తారు. సరిహద్దు రాష్ట్రాల్లోని పోలీసులు, అధికారులతో సమన్వయం చేసుకుంటారు. ఇప్పటికే తనిఖీలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. నగదు తరలిస్తున్న వారి వద్ద బిల్లులు ఉన్నాయా? లేదా? అని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.