ఏపీలో సార్వత్రిక ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని హోరెత్తుస్తున్నాయి. అంతేకాకుండా సినిమా మాధ్యమం ద్వారా కూడా ప్రజలకు చేరువయ్యేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య నేపథ్యంలో రూపొందిన వివేకం సినిమా ఇప్పుడు వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా ఉన్న దస్తగిరిని బాగా ఇబ్బంది పెట్టినట్లుంది. దాంతో దస్తగిరి హైకోర్టును ఆశ్రయించాడు.
వివేకానంద రెడ్డి హత్యలో పాలుపంచుకున్న దస్తగిరి వివేకం సినిమా ప్రదర్శనను ఆపేయాలంటూ హైకోర్టును ఆశ్రయించాడు. ప్రస్తుతం వివేకా హత్య కేసు సీబీఐ కోర్టులో విచారణలో ఉందని, కానీ ఈ సినిమాలో తన పేరును వాడుకున్నారని కాబట్టి సినిమా ప్రదర్శనను ఆపేయాలని దస్తగిరి హైకోర్టును కోరారు. కాగా దస్తగిరి జై భీం భారత్ పార్టీ అభ్యర్థిగా పులివెందుల నుండి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. దస్తగిరి తరపున లాయర్ జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించడం గమనార్హం.
కేవలం రాజకీయ ప్రయోజనాలతో తెలుగుదేశం పార్టీ వెనుక ఉండి ఈ సినిమా ప్రదర్శిస్తుందని జడ శ్రవణ్ కుమార్ హైకోర్టుకు తెలిపారు. ఐ-టీడీపీ ప్రోత్సాహంతో ఈ సినిమా అన్ని ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌లలో అందుబాటులో ఉందని, సెన్సార్ బోర్డు నిబంధనలకు విరుద్ధంగా ఈ సినిమా విడుదలయిందని, పులివెందుల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నందున ఈ సినిమా ప్రదర్శినతో పిటిషనర్ నష్టపోయే అవకాశం ఉందని, ఇది పిటిషనర్ హక్కులకు భంగం కలిగించడమేనని, తెలుగుదేశం పార్టీని, నారా లోకేష్‌ని ప్రతివాదులుగా చేర్చిన జడ శ్రవణ్, తక్షణమే సినిమా ప్రదర్శనను ఆపేయాలంటూ ఎలక్షన్ కమిషన్ కు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరారు. కాగా ఈ పిటిషన్ పై కోర్టు తీర్పు ఎలా ఉండబోతుందో అని సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది.