తెలుగుదేశం, జనసేనతో అలా పొత్తు ఓకే అయిందో.. లేదో.. ఇలా ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి తాను భారీ మెజార్టీతో పార్లమెంట్ సభ్యురాలు అయిపోనట్లు.. ఎన్డీఏ తిరిగి అధికారంలోకి వచ్చి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినట్లు కలలు కనేస్తున్నారు. అసలు కథ ముందుందనే విషయం ఆమెకు అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడికి అవసరం కాబట్టి ఇన్ని రోజులు తగ్గి ఉన్నాడు. ఇప్పుడు కూటమిలో చేరాడు కాబట్టి తన మార్క్ రాజకీయాలు చూపిస్తాడు. ఈ విషయం ఆమెకు తెలియంది కాదు. గతంలో జరిగిన ఘటనలు అలాంటివి. కానీ సోదరి భర్త కదా.. కనికరం ఉంటుందని ఆశ పడుతున్నారు. కానీ బాబు వద్ద ఆ పప్పులేవీ ఉడకవు.
పురందేశ్వరి కాంగ్రెస్‌లో చేరి 2004లో బాపట్ల నుంచి తొలిసారిగా ఎంపీగా గెలిచారు. 2009లో విశాఖపట్నం నుంచి ఎన్నికై ప్రధాని మన్మోహన్ సింగ్ కేబినెట్లో మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2014లో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాజంపేట నుంచి పోటీ చేసి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.
తాజాగా ఎన్డీఏలో టీడీపీ, జనసేన పార్టీలు చేరాయి. దీంతో ఎంపీగా పోటీ చేయాలని చిన్నమ్మ ఉవ్విళ్లూరుతున్నారు. ఈమె రాజమహేంద్రవరం నుంచి పోటీ చేయొచ్చని ఎల్లో మీడియాలో ప్రచారం జరుగుతోంది. గతంలో ఇక్కడి నుంచి ఇద్దరు కమలం అభ్యర్థులు గెలిచారు. దీంతో ఈ స్థానం నుంచి బరిలో ఉండాలని ఆమె ప్రయత్నిస్తున్నారని సమాచారం. కానీ బీజేపీ అధిష్టానం, ముఖ్యంగా చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది.
తండ్రి ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచిన నారా వారి కన్నుసన్నల్లో పురందేశ్వరి కొంత కాలంగా నడుస్తున్నారు. పొత్తు కుదిర్చేందుకు తీవ్రంగా కష్టపడ్డారు. కానీ ఇప్పటికే టీడీపీ – జనసేనల మధ్య విభేదాలు అధికంగా ఉన్నాయి. సీట్ల పంపకం విషయంలో అన్యాయం జరిగిందని సేన నేతలు భావిస్తున్నారు. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఓట్లు ట్రాన్స్ఫర్ అయ్యేది అనుమానమే. ఈ రెండు పార్టీలు కలిసి పురందేశ్వరికి అండగా నిలవకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పైగా బాబును నమ్మలేని పరిస్థితి ఉంది. పనిగట్టుకుని ఓడించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆమె ఎంపీ అయ్యి.. కేంద్ర మంత్రి అయితే తనను లెక్కచేయదని టీడీపీ అధినేతకు బాగా తెలుసు. దీంతో బీజేపీ బాగా బలహీనంగా ఉండే చోట టికెట్ ఇవ్వాలని ప్రయత్నిస్తారు. పొత్తు కారణంగా చిన్నమ్మ ఆశలకైతే రెక్కలొచ్చాయి కానీ.. బలంగా ఎగిరే పరిస్థితులే కనిపించడం లేదు.