ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమా రిలీజ్పై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. నిజానికి వ్యూహం గత సంవత్సరం డిసెంబర్ 29 న రిలీజ్ కావాల్సి ఉండగా ఉద్దేశ్యపూర్వకంగా తమను కించపరిచేందుకు వ్యూహం చిత్రాన్ని తెరకెక్కించారని లోకేష్ కోర్టును ఆశ్రయించడంతో వ్యూహం రిలీజ్ కి బ్రేకులు పడ్డాయి. కాగా దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం జనవరి 11 వరకు సెన్సార్ సర్టిఫికెట్ సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దాంతో చిత్ర నిర్మాత దాసరి కిరణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో విచారణ జరిపిన హైకోర్టు తీర్పును 22 న వెల్లడిస్తామని తెలిపింది.
దాంతో ఈనెల 22 వరకూ వ్యూహం రిలీజ్ పై సస్పెన్స్ కొనసాగనుంది. హైకోర్టు ఆదేశాల మేరకే రివిజన్ కమిటీ సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(సీబీఎఫ్ సీ)సర్టిఫికెట్ ఇచ్చిందని హైకోర్టు ఆదేశాల మేరకు ఇచ్చిన సర్టిఫికెట్ ను ఇదే హైకోర్టులో ఆపడం సరికాదని పిటిషనర్ తరపు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. సినిమా విడుదలను ఆపడం వల్ల నిర్మాత ఎంతో నష్టపోతున్నారని కోర్టు దృష్టికి న్యాయవాది తీసుకొచ్చారు. ఏపీ ఎన్నికల్లో వ్యూహం సినిమా ప్రభావం చూపించే అవకాశం ఉంటే కేవలం తెలంగాణాలో మాత్రమే విడుదల చేసుకునేలా అవకాశం ఇమ్మని కోరితే దానికి కూడా అంగీకరించడంలేదని ఆర్జీవీ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. అందరి వాదనలు విన్న హైకోర్టు వ్యూహం సినిమా విడుదలపై తుది తీర్పును ఈ నెల 22న తెలిపింది.