శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని పాలసముద్రం వద్ద ఏర్పాటవుతున్న నాసిన్ (నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్)ను ప్రధాని నరేంద్ర మోదీ రేపు సందర్శించనున్నారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తో కలిసి, సీఎం వైఎస్ జగన్ ప్రధాని మోదీకి ఆహ్వానం పలకనున్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి గోరంట్ల మండలం పాలసముద్రం చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో పాల్గొని కార్యక్రమం అనంతరం అక్కడి నుంచి బయలుదేరి రాత్రికి తాడేపల్లి చేరుకుంటారు.
2014 రాష్ట్ర పునర్విభజన చట్టంలో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థను నెలకొల్పనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో పాలసముద్రం సమీపంలో 502 ఎకరాల్లో నాసిన్ సంస్థ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ రాష్ట్ర విభజన అనంతరం అధికారంలోకి వచ్చిన నాటి టీడీపీ ప్రభుత్వం కేంద్ర మంత్రులతో శంకుస్థాపనలు చేయడం మినహా ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. 2019 లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అధికారం చేపట్టగానే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంతో 2022 మార్చి 5న పాలసముద్రం సమీపంలో నాసిన్ సంస్థ ఏర్పాటుకు సేకరించిన భూముల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాల సీతారామన్ భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో నాసిన్ పనులు వేగవంతంగా జరిగాయి. ఈ నెల 16న భారత ప్రధాని నరేంద్రమోదీ నాసిన్‌ను సందర్శించనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ పాలసముద్రం వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది.