మిచౌంగ్ తుఫాను ధాటికి రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు తీవ్రంగా నస్టపోయిన విషయం తెలిసిందే. నష్టపోయిన రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇన్పుట్ సబ్సిడీ ద్వారా రైతులందరినీ ఆదుకుంటామని వైయస్ జగన్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పటికే పంట నష్టంపై ప్రాథమిక అంచనాలున్నా అధికారులు డిసెంబర్ 9 నుండి క్షేత్రస్థాయిలోకి వెళ్లి పంట నష్టం ఎంతుందో అంచనా వేయనున్నారు. కాగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ నేడు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు.
తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ నుండి బయల్దేరి మొదట తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డి పాలెం వెళ్లి అక్కడ స్వర్ణముఖి నది కట్ట తెగి నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించనున్నారు. అనంతరం బాపట్ల జిల్లా మరుప్రోలువారిపాలెం వెళ్లి అక్కడ తుపాను బాధితులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పనున్నారు. పిదప కర్లపాలెం మండలం పాతనందాయపాలెం చేరుకుని బాధిత రైతులను పరామర్శించి చివరగా బుద్దాంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. అనంతరం తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు.