సైకిల్ గుమ్మం బయట, టీ గ్లాస్ సింక్ లో - సీఎం జగన్
రాయలసీమలో జరిగిన సిద్ధం సభలో… జగన్ ఎవ్వరూ ఊహించని విధంగా ప్రత్యర్ధి టీడీపీపై విరుచుకుపడ్డారు. ఎప్పుడూ తాను చేసిన పధకాలపైనే మాట్లాడే జగన్ ఈసారి రూటు మార్చి “టీడీపీవి పెత్తందారీ పోకడలు” అంటూ తెలుగు దేశం పంధాని తూర్పారబట్టారు.
మాటల్లో వాడి వేడి పెంచి, సభ పేరుకి తగ్గట్టే యుధ్ధానికి సిద్ధం అన్నట్టు జగన్ ప్రసంగం సాగింది. పరదాలు లేకుండా బయటకు రాడు అని టీడీపీ పదే పదే చేసే విమర్శను తుత్తునియలు చేస్తున్నట్టుగా… లక్షలాది మంది ప్రజల మధ్య ఠీవీగా నడుచుకుంటూ సిధ్ధం వేదికకు చేరిన జగన్… తన ప్రసంగం మొదలుపెట్టడమే… టీడీపీకి చుక్కలు కనపడేలా చేసారు.
ఏ పధకంతో ఎంత మంది లబ్ది పొందింది, ఏ అభివృద్ధితో ఏ ప్రాంతం బాగుపడిందీ, ఏ నోటిఫికేషన్తో ఏ ఉద్యోగం వచ్చిందీ, ఏ స్విచ్ నొక్కితే ఎంత మంది పేద ప్రజల మొహాలపై నవ్వులను చూసిందీ అన్నటువంటి విషయాలను వివరంగా తెలుపుతూ తన ప్రసంగంలో పొందుపరిచారు. ఒక్కో విషయాన్ని విశదీకరించి వివరిస్తూ, ఏ హామీని ఎంత చక్కగా అమలు చేసింది తెలియజేస్తూ జగన్ చేసిన ప్రసంగానికి రాప్తాడు మొత్తం “జై జగన్” నినాదాలతో హోరెత్తిపోయింది.
ఒక దశలో జగనే స్వయంగా… “ఈ రోజు రాయలసీమ లో సముద్రం కనిపిస్తోంది” అని అన్నారంటే సభకి ఎంతమంది ప్రజలు వచ్చారో అర్థం చేసుకోవచ్చు. రాయలసీమలో జగన్ ప్రభ తగ్గిందీ అంటూ గొంతు కొంతకాలంగా గొంతు చించుకున్న తెలుగుతమ్ముళ్ళకిది గొంతులో పచ్చి వెలక్కాయ్ పడేంత ఇబ్బందికరమైన విషయమే.
టీడీపీ వైఖరిని, పొత్తు విషయంలో జనసేన టీడీపీల స్వభావాన్ని, ఇంగ్లీషు మీడియం చదువులతో పేద పిల్లలు ఆ పెత్తందారీ పిల్లలకి సమానంగా అవడం చూడలేకపోతున్నారంటూ చంద్రబాబుని ఇలా ఒక్కొక్కరి గురించి విస్తుపోయేలా జగన్ మాటలు తూటాలు వదిలారు.
ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలి.. సైకిల్ ఎప్పుడూ బయటే ఉండాలి.. త్రాగేసిన టీ గ్లాస్ ఎప్పుడూ సింక్ లోనే ఉండాలి అంటూ సీఎం జగన్ సెటైర్ కూడా వేసి.. వైసీపీ శ్రేణులను నవ్వించి వాళ్ళలో ఉత్సాహాన్ని నింపారు. చంద్రబాబు ఇస్తానన్న మేనిఫెస్టోలోని హామీలను ఉద్దేశించి “ఎగ్గొట్టేవాడు 10 రూపాయల వడ్డీ అయినా ఇస్తాను అంటాడు, మానిఫెస్టో మాయం చేసి హామీలు ఎగ్గొట్టే బాబు కేజీ బంగారం ఇస్తాను అంటాడు, ఆ చుక్కల్ని దింపుతా అంటాడు” అంటూ జగన్ విసిరిన వ్యంగ్యాస్త్రాలు టీడీపీ వాళ్ళకి సూటిగా తగిలాయి. జగన్ వరస చూస్తుంటే… ఈ సారి అతను కొట్టె దెబ్బకి టీడీపీ దిక్కులు పిక్కటిల్లేలా అరిచినా ఆశ్చర్యపోనక్కరలేదు అన్నట్టు ఉంది.