బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం పరిధిలో మేదరమెట్లలో ఆదివారం జరిగిన సిద్ధం సభ సూపర్‌హిట్ అయ్యింది. ఎటు చూసినా జనమే కనిపించారు. దేశ చరిత్రలో ఈ స్థాయిలో భారీ సభను నిర్వహించాలంటే ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే సాధ్యమవుతుందని మరోసారి నిరూపితమైంది. ఇందులో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పంచ్ డైలాగ్స్‌తో ఎల్లో గ్యాంగ్‌పై చెలరేగిపోయారు. ప్రసంగం మొత్తం పార్టీ శ్రేణుల చేత విజిల్స్ వేయించింది. నా మీద, నా పార్టీ మీద నమ్మకంతో ప్రభంజనంలా సిద్ధమంటూ ఉప్పెనలా తరలివచ్చిన జన సమూహం ఓ మహా సముద్రంలా కనిపిస్తోందని వైఎస్సార్సీపీ సైనాన్ని ఉద్ధేశించి జగన్ అన్నారు. గతంలో వాళ్లు కూటమిగా ఉన్నప్పుడు ఇచ్చిన మేనిఫెస్టోను చూపిస్తూ ప్రశ్నలు సంధించారు. ఉర్రూతలూగించే మాస్ స్పీచ్‌లో కొన్ని కీలక పాయింట్లు ఇలా ఉన్నాయి.
నాలుగు రోజుల్లోపే ఎన్నికల నోటిఫికేషన్. మూడు పార్టీలతో చంద్రబాబు కూటమి. ఆయన జేబులో ఉన్న మరో నేషనల్ పార్టీ, బాబు సైకిల్‌కు ట్యూబ్‌లు లేవు. టైర్లు లేవు. అది తుప్పు పట్టింది. దానిని తోయడానికి వేరే పార్టీలు కావాలి. పార్టీల పొత్తులతో బాబు.. ప్రజలే బలంగా మనం. •జగన్‌ను ఓడించాలని వారు.. పేదలను గెలిపించాలని మనం. ఇప్పటికే ఉత్తారంధ్రా సిద్ధం, ఉత్తర కోస్తా సిద్ధం, రాయలసీమ సిద్ధం. ఇప్పుడు దక్షిణ కోస్తా కూడా సిద్ధం. ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తున్న నాకు నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో అంతమంది స్టార్ క్యాంపెయినర్లు ప్రతి ఇంట్లో ఉన్నారు. సైకిల్ చక్రం తిరగక.. చంద్రబాబు ఢిల్లీ చుట్టూ పొర్లు దండాలు పెడుతున్నాడు. చిత్తశుద్ధితో మనం చేసిన మంచే ఆయన్ను పొత్తుల వైపు పరుగులు పెట్టేలా చేసింది. విరగగాసిన మామిడి చెట్లులా మనముంటే.. తెగులు పట్టిన చెట్టులా చంద్రబాబు పరిస్థితి ఉంది.
రాబోయే ఎన్నికల్లో ప్రజలది కృష్ణుడి పాత్ర.. నాది అర్జునుడి పాత్ర, ఇది ధర్మ, అధర్మాల మధ్య జరిగే యుద్ధం.• ఫ్యాన్ ఇంట్లో ఉండాలి.. సైకిల్ ఇంటి బయటే ఉండాలి.. తాగేసిన టీ గ్లాస్ సింకులోనే ఉండాలి. మీ అన్న చేసేదే మేనిఫెస్టో లో పెడతాడు. మీ అన్న మాట ఇస్తే తగ్గేదే లే.. చేసేదే చెప్తాం.. చెప్పామంటే చేస్తాం. బాబుకు ఓటు వేయడమంటే.. చంద్రముఖిని ఇంటికి తెచ్చుకున్నట్లే. రంగు రంగుల మేనిఫెస్టో తెచ్చి, వాటిని తర్వాత చెత్త బుట్టలో పడేసే చంద్రబాబు లాంటి నాయకుడు కావాలా?. మాట ఇస్తే తగ్గేదే లే అన్నట్లు ఉండే మీ జగన్‌లాంటి నాయకుడు కావాలా అని అని అడుగుతున్నా. టీడీపీకి ఓటు వేయడమంటే పథకాల రద్దుకు వేసినట్లే.
జరగబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ సైన్యంలా పని చేయడానికి.. ఎల్లో మీడియా తప్పుడు కథనాలు, రోత రాతల నుంచి పేదవాడి భవిష్యత్‌ను కాపాడేందుకు మీరంతా సిద్ధమేనా అని అడుగుతున్నా.. సిద్ధమే అయితే సెల్‌ఫోన్ తీసి మీ లైట్ బటన్ ఆన్ చేయండి. ఆ వెలుగుతో మేమంతా సిద్ధం అని చెప్పండి. ఇలా వెలుగుల ప్రయాణంలో మరోసారి సిద్ధం అని చెప్పండి. ఇలా జగన్ ప్రసంగం సాగింది. ప్రత్యర్థి పార్టీలపై ఆయన నిప్పులు చెరిగారు. ఐదేళ్లలో చేసిన మంచిని వివరించారు. చంద్రబాబు మోసాలపై ఏకరువు పెట్టారు. పవన్ కళ్యాణ్ పేరు ఎత్తకుండానే విమర్శించారు. మొత్తంగా నాలుగో సిద్ధం సభ ప్రతిపక్షాలకు నిద్ర లేకుండా చేయడం ఖాయం.