అన్నదాతలు బాగుంటే రాష్ట్రం కళకళ లాడుతుంది. వారి సంక్షేమమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపనిచేస్తున్నారు. వ్యవసాయ రంగానికి అన్ని విధాలుగా అండగా ఉన్నారు. రైతులు తమ పంటలను నిల్వ చేసుకుని మద్దతు ధర వచ్చినప్పుడు విక్రయించుకునేలా, ఎరువులు, విత్తనాలు కూడా నిల్వ చేసుకునేలా జిల్లాల్లో మల్టీపర్పస్ గోదాముల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఒక్కో దాని నిర్మాణానికి రూ.లక్షల్లో వ్యయం చేస్తున్నారు.
గోదాముల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఆయా మార్కెట్ యార్డు పరిధిలో రైతులకు అందుబాటులో ఉంచేలా వీటిని నిర్మిస్తున్నారు. ధాన్యం, కూరగాయ పంటలు, రొయ్యలు, చేపలు వంటివి నిల్వ చేసుకునేలా డిజైన్ చేశారు. ఇప్పటికే కొన్ని చోట్ల నిర్మాణాలు పూర్తయి అందుబాటులోకి వచ్చాయి.
తెలుగుదేశం పాలనలో చంద్రబాబు నాయుడు గోదాముల ఊసే ఎత్తలేదు. వ్యవసాయం దండగగా భావించిన ఆయన రైతులకు ఎటువంటి సహకారం అందించలేదు. అయితే సాగును పండగ చేయాలనే లక్ష్యంతో సీఎం జగన్ అనేక కార్యక్రమాలు చేపట్టారు. వాటిలో గోదాముల నిర్మాణం ఒకటి. విపత్తుల సమయంలో పంటలను కాపాడుకోవడంతోపాటు ధరలు పెరిగినప్పుడు విక్రయించుకునేలా ఉత్పత్తులను నిల్వ చేసుకునేలా వీటి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాము నిర్మాణానికి సుమారు రూ.43 లక్షలు, వెయ్యి మెట్రిక్ టన్నుల సామర్థ్యమున్న గోదాము కోసం రూ.72 లక్షలు మంజూరు చేశారు. మార్కెటింగ్, రెవెన్యూ, కో-ఆపరేటివ్ తదితర శాఖల అధికారులు సమన్వయంతో ఈ మల్టీపర్సస్ గోదాముల నిర్మాణం వేగంగా జరిగేలా చర్యలు తీసుకున్నారు.
అధికారిక గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు వ్యవసాయ రంగంలో రూ.16 వేల కోట్లతో మౌలిక వసతుల కల్పన జరిగింది. 2.44 లక్షల టన్నుల అదనపు నిల్వ సామర్థ్యంతో 462 వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ కేంద్రాలు, 84 సౌర శీతల గిడ్డంగులు, 2,905 ప్యాక్ హౌస్లను ఏర్పాటు చేశారు. జగన్ రైతులకు అండగా ఉంటామని మాటలకే పరిమితం కాలేదు. చేసి చూపించారు.