జగనన్న విద్యాదీవెన పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదలలో భాగంగా ముఖ్యమంత్రి జగన్కృష్ణా జిల్లా పామర్రులో పర్యటించనున్నారు. పేద విద్యార్థులు చదువుకోవాలన్న సదుద్దేశ్యంతో జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జగనన్న విద్యా దీవెన పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా జగనన్న విద్యా దీవెన నిధులను పామర్రులో బటన్ నొక్కి సీఎం జగన్ విడుదల చేయనున్నారు.
గత ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్మెంట్ సక్రమంగా అమలు కాకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు అనేక అవస్థలు పడేవారు. సకాలంలో ఫీజులు చెల్లించలేని విద్యార్థులకు పరీక్షలకు హాల్టికెట్లు, పాసైతే సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందిపెట్టేవి. కళాశాలల ఫీజుల కంటే తక్కువగానే ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడంతో పేదలపై మరింత భారం పడేది. ఈ పరిస్థితికి చెక్ పెడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశపెట్టడంతో పేదింటి బిడ్డల చదువులకు భరోసా దక్కింది. టీడీపీ ప్రభుత్వంలో అత్యధికంగా ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఏడాదికి రూ.35 వేలలోపు ఇస్తే వైఎస్ జగన్ ప్రభుత్వం ఏకంగా రూ.3లక్షలకు వరకు చెల్లిస్తూ పేదల విద్యను పట్టం కడుతోంది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఇద్దరిలో జవాబుదారీతనం పెరగడానికి, పారదర్శకంగా తల్లి, విద్యార్థి జాయింట్ బ్యాంకు ఖాతాల్లో ప్రతి త్రైమాసికానికి విద్యాదీవెన నగదును జగన్ ప్రభుత్వం చెల్లిస్తుంది.
ఇప్పటివరకూ జగనన్న విద్య దీవెన పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 26,98,728 మంది విద్యార్థులకు రూ. 11,901 కోట్ల రూపాయల లబ్ది చేకూరగా జగనన్న వసతి దీవెన పథకం ద్వారా 25,17,245 మంది విద్యార్థులకు రూ. 4275.76 కోట్ల లబ్ది చేకూరింది. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ద్వారా 2605 మంది విద్యార్థులకు, రూ. 219.53 కోట్ల సాయాన్ని జగన్ ప్రభుత్వం అందించింది.
కాగా పామర్రు పర్యటనలో భాగంగా ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి ముఖ్యమంత్రి జగన్ బయలుదేరి పామర్రు చేరుకుంటారు, అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించి, జగనన్న విద్యా దీవెన నిధులను బటన్ నొక్కి తల్లి, విద్యార్థి జాయింట్ బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసిన అనంతరం మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు.