తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడికి కాపులంటే చిన్నచూపు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారికి తీవ్ర అన్యాయం జరిగింది. సంక్షేమాన్ని, సమస్యలను విస్మరించారు. కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకున్నారు. వారు రాజకీయంగా, ఆర్థికంగా ఎదగకుండా కుట్రలకు తెరలేపారు. ఎన్నికల సమయంలో ఊరించే హామీలు గుప్పించడం, తర్వాత మర్చిపోవడం నారా వారి నైజమన్న విషయం కాపులకు తెలిసింది. అందుకే 2019లో జగన్‌కు పట్టం కట్టారు. ఇక వైఎస్సార్సీపీ ప్రభుత్వం వైఎస్సార్ కాపునేస్తం పథకానికి శ్రీకారం చుట్టింది. దీని అమలుపై గత ఎన్నికల మేనిఫెస్టోలో ఎలాంటి హామీ ఇవ్వలేదు. అయినప్పటికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కాపుల సంక్షేమానికి పథకాన్ని అమలు చేశారు. అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో ప్రతి ఏటా రూ.15 వేలను నేరుగా జమచేశారు.
45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల మహిళల సంక్షేమం కోసం వైఎస్సార్ కాపు నేస్తం పథకాన్ని అమలు చేస్తున్నారు. ఐదేళ్లలో రూ.75,000 మేర ఆర్థిక సాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యం. ఇప్పటి వరకు నాలుగు విడతల్లో సర్కారు అందజేసిన రూ.15 వేల నగదును కాపులు సద్వినియోగం చేసుకున్నారు. 2020 సంవత్సరం జూన్ 24వ తేదీన ముఖ్యమంత్రి జగన్ ఈ పథకాన్ని ప్రారంభించారు. దీని కింద వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇప్పటివరకు మొత్తం చేసిన ఆర్థిక సాయం రూ.2,029 కోట్లు. లబ్ధిదారుల సంఖ్య 3.50 లక్షలకు పైనే.. ఒక్కో పేద కాపు అక్కచెల్లెమ్మకు నాలుగేళ్ల కాలంలో అందించిన లబ్ధి అక్షరాలా రూ.60,000.
గత ప్రభుత్వ హయాంలో కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు వివిధ రూపాల్లో ఐదు సంవత్సరాల్లో సగటున ఏడాదికి కనీసం రూ.400 కోట్లు కూడా ఇవ్వని దుస్థితి ఉంది. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఆ పరిస్థితి మారింది. 2023 సెప్టెంబర్ నాటికి అందుబాటులో ఉన్న గణాంకాలను చూస్తే వివిధ పథకాల ద్వారా 77,00,628 మంది కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల లబ్ధిదారులకు రూ.39,247 కోట్ల లబ్ధి చేకూర్చారు. అది కూడా అత్యంత పారదర్శకంగా.
బాబు అధికారంలో ఉన్నప్పుడు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. మంత్రిగా ఉన్న లోకేశ్ అయితే ఆ పెద్దాయనను బండ బూతులు తిట్టారు. 24 ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మరోసారి కాపులను మోసం చేసేందుకు టీడీపీ అధినేత పూనుకున్నారు. ఈసారి వారికి ముద్రగడ అవసరమయ్యాడు. అందుకే నేతల్ని రాయబారానికి పంపాడు. ఆయన ససేమిరా అనడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ముందుపెట్టారు. ఇదిలా ఉండగా 19లో జనసేనను విడిగా పోటీ చేయించి నష్టపోవడంతో నేడు పొత్తు పెట్టుకుని బరిలోకి దిగుతున్నారు. కానీ ఇక్కడ కూడా సేనకు తక్కువ సీట్లు ఇచ్చి వెన్నుపోటు పొడవాలని చూస్తున్నారు. ఇక జగన్ విషయానికొస్తే కాపులకు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. తమ సంక్షేమానికి కట్టుబడిన జగన్ వైపే ఉంటామని కాపు సామాజిక వర్గం చెబుతోంది.