ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇంట సంక్రాంతి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు సీఎం జగన్ సాంప్రదాయ దుస్తుల్లో సతీ సమేతంగా పాల్గొన్నారు. సీఎం వైఎస్ జగన్, భారతమ్మ దంపతులకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలకగా గోశాల వద్ద భోగి మంటలు వేయటంతో పండుగ సంబరాలు మొదలయ్యాయి. అనంతరం జగన్, భారతమ్మ దంపతులు గంగిరెద్దులకు సారెను సమర్పించారు. అందరికీ మంచి జరగాలంటూ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
తాడేపల్లిలో సీఎం క్యాంప్ కార్యాలయం గోశాల వద్ద గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా, పూర్తిగా పల్లె వాతావరణం, అభివృద్ది కార్యక్రమాలు ఉట్టిపడేలా ఏర్పాట్లు చేశారు. వందేళ్ళ క్రితం తిరుమల ఏ విధంగా ఉండేదో అదే తరహాలో ప్రత్యేకంగా సెట్టింగ్ వేయడం అందరిని ఆకట్టుకుంది. గోశాలలోని గోవులకు ప్రత్యేక పూజలు, హరిదాసుల కీర్తనలు, పిండివంటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల సంక్రాంతి నృత్యాలతో వైభవంగా సంక్రాతి వేడుకలు జరుగుతున్నాయి.
ప్రభుత్వ విప్ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి పర్యవేక్షణలో ఈ సంబరాలు నిర్వహిస్తుండగా ఈ సంబరాల్లో డిప్యూటీ సీఎంలు కొట్టు సత్యనారాయణ, నారాయణ స్వామి, మంత్రి ఆదిమూలపు సురేష్, వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ.సుబ్బారెడ్డి, ఎంపీ నందిగం సురేష్, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులుహాజరయ్యారు.