గడ్డిపరక ఎగిరొస్తే, ఎందుకైనా పనికొస్తుందని దానితో కూడా పొత్తు పెట్టుకునే స్థాయికి వచ్చింది చంద్రబాబు రాజకీయం. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా అభ్యర్థుల వివరాలు విడుదల చేసి, మరికొన్నిటిని బీజేపీ పొత్తు కోసం అట్టే పెట్టి ఉంచిన చంద్రబాబు, బీజేపీ నుంచి పొత్తు సంకేతాలు వచ్చి పంతొమ్మిది రోజులైనా ఇంకా పిలుపురాలేదిమిటా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.
“ప్రతి సీటు గెలవాల్సిందే, అందరినీ కలుపుకుని సాగండి” అని తెలుగు తమ్ముళ్ళకు, జనసైనికులకు పిలుపునిచ్చినా… వాళ్ళెవరూ వినే విధంగా లేకపోవడం చంద్రబాబు కు పెద్ద తలనొప్పిగా తయారయింది. రాజమండ్రి రూరల్ బుచ్చయ్య చౌదరికి కాకుండా జనసేన అభ్యర్థికి ఇవ్వడంతో బుచ్చయ్య అతని అభిమానులు అలకపానుపు ఎక్కేసారు. అసలే బుచ్చయ్య తో బాబుకి వెన్నుపోటు రోజులు నుంచీ సాన్నిహిత్యం ఉంది. మరొక వైపు బుచ్చయ్య కే రాజమండ్రి ఇచ్చి, కందుల సురేష్‌ని నిడదవోలు పంపుదాం అనుకుంటుంటే… అక్కడి స్థానిక అభ్యర్థి అభిమానులు ప్రకటన రాకముందే తమ నిరసనను తెలియచేస్తున్నారు.
ఇంక జనసేన నేతలైతే… పొత్తులో భాగంగా వచ్చిన సీట్లు సంఖ్యపై ముందు నుంచీ గరంగానే ఉన్నారు. కాపు నేతలైతే ఒక్కొక్కరుగా జారిపోతున్నారు కూడా. రాయలసీమలో సీట్ల మార్పిడితో ముందునుంచీ ఖర్చులు పెట్టిన అభ్యర్థులు బాహాటంగానే చంద్రబాబు శైలిని విమర్శించి తమ అసహనాన్ని బయటపెడుతున్నారు.
“నైరాశ్యంలో జగన్ కుట్రలకు పాల్పడొచ్చు” అంటూ చంద్రబాబు చెబుతున్నారు. అయితే టికెట్ల కేటాయింపు విషయంలో చంద్రబాబు చేసిన కుట్రలకే సగం నేతలు నైరాశ్యంలోకి దిగిపోయారు. 1.3 కోట్ల ప్రజల మంది నుంచి సర్వేలు తీసుకుని మరీ టికెట్లు ఇచ్చానన్న బాబు.. మరి మిగతా స్థానాలను మాత్రం బీజేపీ పొత్తు కోసం ఎందుకు పక్కన పెట్టారో మాత్రం చెప్పట్లేదు. మొత్తమ్మీద గజిబిజి గందరగోళం గా సీట్లు కేటాయింపు జరిగి, అసంతృప్తులు పెరిగి, పొత్తు చిరిగే అవకాశాలు మాత్రం నిండుగా కనిపిస్తున్నాయ్.