పంతొమ్మిది వందల డెభ్భై ఎనిమిది , మార్చి పదిహేను. భూగోళం వణికిందా? ఆంధ్రప్రదేశ్ బెణికిందా అన్నట్టు ఆ రోజు ఓ మహానుభావుడు శాసన సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేసి… నేటికి నలభైఆరేళ్ళు. “ఇప్పటికింకా నా అనుభవం నిండా నలభై ఆరే… చీటికి మాటికి పొత్తంటూ… పార్టీలు మారుస్తానే…” అని భారతదేశ చరిత్రలో పాడుకోగల ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారూ… అంటే అది మన చంద్రబాబు నాయుడు గారే.
ఎదురు దెబ్బలు పాఠాలుగా, గాయాలు గుణపాఠాలుగా అంటూ… ఆయన గారి పెంపుడు పత్రికల్లో పెద్ద పెద్ద టైటిల్సు పెట్టొచ్చేమో కానీ… నిజానికి ఆయనది దిన దిన గుండం, నూరేళ్ళ ఆయుష్షు, నలభై ఆరేళ్ళ అనుభవం, ముప్పై ఆరు పొత్తుల చరిత్ర. ఏనాడూ గుండెపై చెయ్యేసుకుని హాయిగా పడుకోలేనంత దిగులుని ఇచ్చే గతాన్నీ, వర్యమానాన్నీ, భవిష్యత్తునీ ఏక కాలంలో కలిగి ఉండే ఏకైక రాజకీయ ప్రాణి చంద్రబాబు.
తనకు అవసరం ఉన్నచోట, అవసరం పుడుతుంది అనుకున్న చోట, అవసరాన్ని పుట్టించాలి అని కోరుకున్న చోట… నిస్సిగ్గుగా ఎంత కిందకు అయినా దిగిపోగల ఏకైక విజనరీ బాబు మాత్రమే. తనకు కావలసినపుడు త్రాచు పాము అవగలరూ, కాదూ అనుకుంటే వానపాములా మారగలరు, అవసరం అనిపిస్తే రబ్బరు పాములా అయినా రూపాంతరం చెంది తనకి కావలసిన పైరవీలు నడుపుకోగలరు. సంక్షోభం నుంచి సంపద సృష్టించగలటం ఇదేనేమో. సంక్షోభాన్ని తానే సృష్టించి అందులోంచి తన సంపదను పెంచుకోవడం.
అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ.. కుట్రలు, వెన్నుపోటులు, కూటములు, పొత్తులూ ఆ పొత్తులలో మళ్ళీ చిత్తు లెక్కలు ఇలా ఎన్నో శిరోభారాలతో అనుక్షణం నిశ్చింత లేని జీవితం ఆయన సొంతం. నిద్రలేని రాత్రులు గడపగల రాజకీయాలు ఆయన సొంతం. పేరుకి విజనరీ అనీ, ఆంధ్రప్రదేశ్ పిల్లలు తనకు దణ్ణమెట్టాలనీ, తానే లేకుంటే పేడ పిడకా ఎత్తుకుంటూ ఉండి ఉండేవారనీ ఇలా నోటికి వచ్చిన ఏ మాట అయినా… ఆయన గారి ఇమేజిని వెడల్పు చేసేందుకోసమే వస్తుంది.
నేటి తరానికి చంద్రబాబు మార్గదర్శి అనీ, ఆయన కన్న కలలే ఈనాటి మన జీవితం అనీ, ఆయన పెడితే ప్రియా పచ్చడి అయినా… పాయసం మాదిరి ఉంటుందని పాపం తెలుగు తమ్ముళ్ళు అంటుంటారు. వాళ్ళని ఈయన ఎంతలా మభ్యపెట్టాడంటే… ఆఖరుకి యన్టీఆర్ కి పొడిచిన వెన్నుపోటుని కూడా పాపం బాబు గారు మామగారికి “బ్యాక్ బోన్ సర్జరీ” చేసారు అనుకునేంతలా మభ్య పెట్టారు.
ఎప్పుడూ ప్రజల ఉన్నతి గురించే బాబు ఆలోచిస్తారు అనే మాట మరొక విరోధాభాసం. మరి ఉన్నతి గురించి ఆలోచించినపుడు అన్నేళ్ళు అధికారంలో ఉన్నా ఎందుకు ఉన్నతి కలిగించలేదు అనేది మాత్రం… సమాధానం లేని ప్రశ్న. మరి ఇకనైనా చంద్రబాబు కుయుక్తులతో కూడిన రాజకీయాలను వదిలేసి, ప్రశాంతంగా పడుకోగల శక్తిని సంపాదించాలనీ… ఇంత వయసు వచ్చింది కనుక… ఇక కొంపలు కూల్చే పనులు మాని… మరిన్నేళ్ళు రాజకీయాల్లో ఉండాలని, ఆయన కనిపెట్టానని చెప్పిన అనేక ఆవిష్కరణలను గిన్నిస్ బుక్ లో ఎక్కేవిధంగా పాటు పడాలని ఈ సంధర్భంగా మనమందరం కోరుకుందాం!!!