రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించుకుంటూ కుర్చున్నాడట. అలా ఉంది టీడీపీ-జనసేన పొత్తు పరిస్థితి. 118 స్థానాల్లో కూటమిగా పోటీ చేస్తామని చెబుతూనే తొలి జాబితాలో 99 మంది అభ్యర్థులను చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా ప్రకటించారు. పైగా పొత్తు సూపర్ హిట్ అని స్టేట్మెంట్ కూడా ఇచ్చేసారు. ఓ పక్క తమకు సీట్ దక్కలేదని ఆగ్రహావేశాలతో ఇరు పార్టీల నాయకులు ఊగిపోతుంటే మా పొత్తు సూపర్ హిట్టు, మా బొమ్మ బ్లాక్ బస్టర్ అని ప్రకటనలిచ్చుకుంటూ మురిసిపోతున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్.
వాస్తవానికి జనసేనకు కేవలం 24 సీట్లు మాత్రమే చంద్రబాబు కేటాయించడంతో జనసేన కార్యకర్తల్లో తీవ్ర నైరాశ్యం నెలకొంది. తమ అధినేత పవన్ కళ్యాణ్ తమ అభిమానాన్ని చంద్రబాబు కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టాడని భావిస్తుండగా మరోవైపు టీడీపీ తరపున ఎంతోకాలంగా ఆయా నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలను భుజాలపై మోస్తూ, కోట్లాది రూపాయలను ఖర్చు చేసిన అభ్యర్థులను పక్కనబెట్టి, చివరి నిమిషంలో ఎక్కువమొత్తం డబ్బు ఇచ్చిన నాయకులకు సీట్లు కేటాయించారని కొందరు నాయకులు నిరసన గళాలను వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ తరపున మొదటి జాబితాలో అత్యంత సీనియర్ నాయకులకు కూడా చోటు దక్కకపోవడంతో బాబు మనసులో ఏముందో అని ఆయా నాయకులు సన్నిహితుల దగ్గర వాపోతున్నారు.
బుద్దావెంకన్న, ఏపీ టీడీపీ మాజీ చీఫ్గా పనిచేసిన కిమిడి కళా వెంకట్రావు, గుంటూరు జిల్లాలో యరపతినేని, ఆలపాటి రాజా, పెద్దకూరపాడు నుంచి కొమ్మాలపాటి శ్రీధర్, ఉండి నుంచి వేటుకూరి శివరామరాజుతో పాటు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న పార్టీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరికి కూడా తొలిజాబితాలో సీటు దక్కలేదు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజక వర్గం టీడీపీ అభ్యర్థిగా జయచంద్ర రెడ్డిని ఖరారు చేసిన నేపథ్యంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే శంకర్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. జి.శంకర్ కార్యాలయంపైన ఉన్న టీడీపీ ఫ్లెక్సీలను, జెండాలను పీకి విసిరేయడం సంచలనంగా మారింది. టీడీపీ సీనియర్ నాయకుడు , అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే ,శాసనసభ ఉప సభాపతిగా పని చేసిన మండలి బుద్ధ ప్రసాద్ పేరు తొలి జాబితాలో లేకపోవడంతో ఎక్స్ వేదికగా నిరసన వ్యక్తం చేశారు. పెడన సీటు దక్కక పోవడంపై బూరగడ్డ వేదవ్యాస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇలా రాష్ట్రవ్యాప్తంగా అటు టీడీపీలో టికెట్లు దక్కని నేతలు అసంతృప్తితో రగిలిపోతుంటే జనసేన కార్యకర్తలు తమకు అన్యాయం జరిగిందంటూ పవన్ కళ్యాణ్ తమ అభిమానంతో ఆడుకుంటున్నాడని వాపోతున్నారు. ఇలా ఇరు పార్టీలు నిరసన జ్వాలలతో రగిలిపోతుంటే తమ పొత్తు సూపర్ హిట్ అని చెప్పుకోవడం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకే చెల్లింది.