తెలుగుదేశానికి నాలుగు దశాబ్దాల చరిత్ర ఉంది. ఎంతో వైభవాన్ని చూసిన ఆ పార్టీకి నేడు బ్యాడ్ టైమ్ నడుస్తోంది. కేంద్రంలో గిరగిరా చక్రాలు తిప్పిన చంద్రబాబు నాయుడికి వచ్చే ఎన్నికల్లో గెలుస్తామని నమ్మకం లేక పవన్ కళ్యాణ్‌పై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు ఓట్ల కోసం జనసైనికుల కాళ్లు, గడ్డాలు పట్టుకుంటున్నారు.
చాలా నియోజకవర్గాల్లో జనసేన నేతలు టికెట్లు ఆశించారు. అయితే అవన్నీ చంద్రబాబు లాక్కొన్నారు. పవన్‌కు కేవలం 24 మాత్రమే ఇచ్చారు. అందులోనూ కొన్ని తీసుకునే ప్రయత్నంలో ఉన్నారు. దీంతో చాలా చోట్ల జనసైనికులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఆ మంటలు ఇంకా చల్లారలేదు. టీడీపీ అభ్యర్థులను ఓడిస్తామని పవన్ పార్టీ నేతలు బహిరంగంగా ప్రకటిస్తున్నారు. సీట్ల పంపకాల విషయంలో జనసేన శ్రేణులు చాలా అసంతృప్తిగా ఉన్నాయని, దీంతో ఓట్లు ట్రాన్స్ఫర్ కావని చంద్రబాబు గ్రహించారు. అందుకే వారిని కలుపుకొని పోవాలని తెలుగు తమ్ముళ్లకు పదేపదే చెబుతున్నారు.
ఇటీవల తన 94 మంది అభ్యర్థులతో బాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేన నేతల్ని నిర్లక్ష్యం చేయొద్దని, ఆ పార్టీ కేడర్‌తో సమన్వయంతో ముందుకెళ్లాలని ఆదేశించారు. టికెట్లు రాలేదని అసంతృప్తిగా ఉన్న సేన నేతలు, ఆ పార్టీ ముఖ్యుల వద్దకు నేరుగా వెళ్లి డబ్బులతో ప్రలోభపెట్టడమో, బతిమిలాడుకోవడమో, అధికారంలోకి వస్తే ఏదో ఒకటి చేస్తామని చెప్పడమో చేయాలని అధిష్టానం నుంచి అభ్యర్థులకు ఆదేశాలు వెళ్లాయి. దీంతో అయిష్టంగానే వెళ్లి కలుస్తున్న పరిస్థితులున్నాయి.
జనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా మనుక్రాంత్‌రెడ్డి ఉన్నారు. ఈయన 2019లో నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత సిటీలో కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. ఆరునెలల నుంచి మాజీ మంత్రి పొంగూరు నారాయణ నగరంలో ఉంటూ టీడీపీ టికెట్ తనదేనని ప్రకటించారు. ఈలోగా పవన్, బాబుల మధ్య పొత్తు కుదిరింది. మనుక్రాంత్, నారాయణ ఎవరికి వారు సిటీ స్థానం తమదేనని చెప్పుకొన్నారు. కానీ పవన్ కూడా నారాయణ వైపే మొగ్గు చూపారు. ఈ క్రమంలో సంప్రదాయంలో భాగంగా రూరల్ స్థానం ఇస్తారని మనుక్రాంత్ భావించారు. కానీ తొలిజాబితాలో సిటీ నారాయణకు, రూరల్ కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి ఇచ్చేశారు. చంద్రబాబు. జిల్లాలో ఎక్కడా సేనకు టికెట్ ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో మనుక్రాంత్‌రెడ్డి మనస్తాపానికి గురై రెండు రోజుల క్రితం ప్రెస్‌మీట్ పెట్టి సీటు సాధించలేకపోయినందుకు క్షమించాలని కార్యకర్తలను కోరారు. ఆ సమయంలో టీడీపీకి వ్యతిరేకంగా వారంతా నినాదాలు చేశారు. పవన్ పార్టీని అమ్మేశాడని కొందరు జనసైనికులు ఆవేదన చెంది ఉమ్మడి కార్యక్రమాలకు దూరమయ్యారు.
జనసేన తమ కోసం పనిచేయదని తెలుగుదేశం అభ్యర్థులకు అర్థమైపోయింది. ఇంతలో చంద్రబాబు నుంచి ఆదేశాలు రావడంతో సేన కార్యాలయాలకు క్యూ కడుతున్నారు. శుక్రవారం టీడీపీ అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తన తమ్ముడు గిరిధర్‌రెడ్డి, మరికొందరు నేతల్ని వెంటేసుకుని మనుక్రాంత్‌రెడ్డి, సేన నేతల్ని కలిసి బతిమిలాడుకున్నారు. తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి వద్దకు తీసుకెళ్లి మాట్లాడించారు. అందరికీ కలిపి భారీ ప్యాకేజీ ఇస్తామని ప్రలోభపెట్టినట్లు సమాచారం. మరోవైపు నారాయణ కూడా జనసైనికులను మచ్చిక చేసుకునే పనిలో ఉన్నారు. డివిజన్లలో తన కోసం పనిచేస్తే ఎంత డబ్బు కావాలన్నా ఇస్తానని చెప్పేశారు. కొంత మొత్తం ముచ్చజెప్పారు కూడా..
అయితే రెండు పార్టీల్లో కొందరు నేతల నుంచి భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు నమ్మదగిన వ్యక్తి కాదని, అవసరం కోసం వాడుకుని వదిలేస్తాడని జనసైనికులు పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు డబ్బు కోసం అర్రులు చాస్తే.. తర్వాత పార్టీ ఎదగకుండా ఎటూ కాకుండా పోతుందని వాపోతున్నారు. మరోవైపు కొందరు తెలుగు తమ్ముళ్లకు జనసేన నేతల్ని బతిమిలాడుకోవడం నచ్చడం లేదు. వారికి అసలు ఓటు బ్యాంక్ లేదని, డబ్బులు వృథా చేసుకోవడం ఎందుకని నేతలకు చెబుతున్నారు. నేరుగా వెళ్లి బతిమిలాడుకుంటే తాము బలవంతులమని భావించి ఇంకా బెట్టు చేస్తారని, అలా వదిలేస్తే.. కొద్దిరోజులకు వాళ్లే మన వెంట తిరుగుతారని భావిస్తున్నారు.
రాజకీయ చరిత్రలో ఇదో చిత్రవిచిత్రమైన పొత్తులా మారిపోయింది. పవన్ ఏమో చంద్రబాబును సీఎం చేయాలని పనిచేస్తున్నారు. ఇందుకోసం జనసైనికులకు వెన్నుపోట్లు పొడిచారు. సేనానిది నిలకబడ లేని మనస్తత్వమని, ఆ పార్టీ నేతలు తమ కోసం పనిచేయరనే అభద్రతా భావంలో చంద్రబాబు ఉన్నారు. సభల్లో తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు కొట్టుకుంటున్నారు. మొత్తానికి పైకి నవ్వుకుంటూ మేమంతా ఒకటేనని చాటుతున్నా.. ఒకరిపై ఒకరికి నమ్మకం మాత్రం లేదు.