సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ అంటే తెలియని వారు ఉండరు. ఎన్నో సినిమాలతో దేశంలో సంచలనం సృష్టించిన ఆయన కొంతకాలంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడికి చుక్కలు చూపిస్తున్నారు. తనదైన శైలిలో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ తెలుగు తమ్ముళ్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. శనివారం ఆయన చంద్రబాబు లక్కీ నంబర్ 23 అంటూ ట్విట్టర్ (ఎక్స్)లో పెట్టిన పోస్టు వైరలైంది. అందులో ఈ విధంగా రాసుకొచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి చంద్రబాబు లాక్కున్న ఎమ్మెల్యేల సంఖ్య 23. 2019లో ఆయన గెల్చుకున్న స్థానాలు 23. పోలీసులు అరెస్ట్ చేసిన తేదీని కూడితే 23. ఆయన ఖైదీ నంబర్ 7691. దీనిని కూడినా 23 వస్తుంది. ఎన్టీఆర్ నుంచి లాక్కున్న పార్టీకి వారసుడిగా చేద్దామనుకుంటున్న లోకేశ్ పుట్టిన తేదీ 23. ఇక తన వ్యూహం సినిమా రిలీజ్ తేదీ 23 అని ప్రకటించారు.
నిజమే కదా..
2019 ఎన్నికల్లో చంద్రబాబు ఘోరంగా ఓడిపోయారు. జనం ఛీ కొట్టడంతో కేవలం 23 అసెంబ్లీ స్థానాలకే పరిమితమయ్యారు. అప్పటి నుంచి ఆయన్ను ఆ నంబర్ వెంటాడుతూనే ఉంది. ప్రతి ముఖ్యమైన సంఘటన ఆ అంకెకు లింక్ అవుతోంది. పలు దేశాల్లో 13వ నంబర్ అంటే కొందరు భయపడుతుంటారు. మన రాష్ట్రం విషయానికొస్తే టీడీపీ తమ్ముళ్లు 23 నంబర్‌ను చూస్తే చిర్రెత్తిపోతారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి లాక్కున్నారు. వారిలో కొందరిని మంత్రులు కూడా చేశారు. దీనిని ప్రజాస్వామ్మవాదులు ఖండించినా పట్టించుకోలేదు. సంతలో పశువులు కొన్నట్లు కొన్నారని వైఎస్సార్సీపీ నాయకులు తిట్టినా తుడిచేసుకున్నారు. విధి అంటే ఇదేనేమో అనేలా 19లో బాబు పార్టీ 23 స్థానాల్లోనే గెలిచింది. ఇక స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసింది గత సంవత్సరం సెప్టెంబర్ 9వ తేదీన. దీనిని కూడితే 23 వస్తోంది. అదే విధంగా రాజమండ్రి జైల్లో బాబుకు ఇచ్చిన నంబర్ 7691. దీనిని కూడినా తమ్ముళ్లను భయపెట్టే ఆ అంకె దర్శనమిస్తుంది. నారా వారి వారసుడు లోకేశ్ 1983 సంవత్సరం జనవరి 23వ తేదీన పుట్టారు. ఇందులోనూ ఆ సంఖ్య ఉంది. అందుకే ఆర్జీవీ ఈ పోస్టు పెట్టి తన సినిమాకు హైప్ తెచ్చే ప్రయత్నం చేశారు.
సినిమా కోసం..
ఆర్జీవీ గతంలో చంద్రబాబు కుట్రలపై సినిమాలు తీశారు. అందులో లక్ష్మీస్ ఎన్టీఆర్, అమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాలున్నాయి. వాటిల్లో బాబు, లోకేశ్, పవన్ నిజ స్వభాలను చూపించారు. అచ్చుగుద్దినట్లు ఉండే వ్యక్తులను తెచ్చి నటింపజేసి శభాష్ అనిపించుకున్నారు. దీంతో ఆయనపై తెలుగుదేశం పార్టీకి విపరీతమైన కోపం ఉంది. తాజా సినిమా వ్యూహం రిలీజ్ కాకుండా నారా లోకేశ్ అడ్డుకున్నారు. సెన్సార్ పూర్తయిన ఈ సినిమాపై ఆయన తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి విడుదలను తాత్కాలికంగా ఆపింది. సినిమాను మరోసారి సమీక్షించి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలని ఆదేశించింది. దీంతో రెండోసారి సెన్సార్ నిర్వహించి ఎలాంటి ఇబ్బందుల్లేవని బోర్డు తెలపడంతో విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. దివంగత వైఎస్సార్ మరణం తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో జరిగిన పరిణామాలపై తెరకెక్కిన ఈ సినిమాను చంద్రబాబు లక్కీ నంబర్ అయిన 23వ తేదీన రిలీజ్ చేస్తామని ప్రకటించారు. దీంతో తెలుగు తమ్ముళ్లు మాకు ఈ ఖర్మ ఏందిరా అంటూ ఏడుస్తున్నారు.
ఆర్జీవీ గతంలోనూ లోకేశ్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లను ట్యాగ్ చేస్తూ అనేక పోస్టులు పెట్టారు. దీంతో వారి అభిమానగణానికి ఈయనంటే పడదు. నిత్యం తిడుతూ ఉంటారు. అందుకే తిడుతూ పోస్టులు పెడుతుంటారు. అయితే వర్మ మాత్రం పట్టించుకోకుండా వారిపై సెటైర్లు వేస్తూనే ఉంటారు. ఎన్టీఆర్ వర్ధంతి రోజున లోకేశ్ ట్వీట్ పెట్టారు. దీనికి వర్మ మరి రామారావును చంపిన వ్యక్తిని ఏం చేశారని ప్రశ్నించారు. వ్యూహంపై తమ్ముళ్లు ఏడిస్తే ఆర్జీవీ 23 అనే టైటిల్‌తో సినిమా తీసినా ఆశ్చర్చపోనక్కర్లేదు.