రాయలసీమ.. చంద్రబాబు నాయుడు పుట్టిన ప్రాంతం. ఇక్కడి చిత్తూరు జిల్లాలో ఉన్న కుప్పం నియోజకవర్గం రాజకీయంగా ఎదుగుదలకు అవకాశం ఇచ్చింది. కానీ సీమకు మాత్రం బాబు ఎప్పుడూ ద్రోహం చేయాలని చూస్తుంటారు. అనంతపురం జిల్లాలో ఏర్పాటు కావాల్సిన ప్రతిష్టాత్మక ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)ను తన రియల్ ఎస్టేట్ వెంచర్ అయిన అమరావతి కోసం మంగళగిరికి తరలించారు.
గుంటూరు జిల్లా మంగళగిరిలో ఎయిమ్స్‌ను రూ.1,618.23 కోట్లతో 183.11 ఎకరాల్లో.. 960 పడకలతో నిర్మించారు. ఇందులో 125 సీట్లతో కూడిన వైద్యకళాశాల ఉంది. దీనిని ఆదివారం ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. వాస్తవానికి ఎయిమ్స్ అనంతపురంలో ఏర్పాటు కావాలి. కానీ అప్పటి సీఎం చంద్రబాబు అడ్డుకున్నారు.
2014–15 కేంద్ర బడ్జెట్లో అనంతపురానికి ఎయిమ్స్‌ను కేటాయించారు. అయితే బాబు మంగళగిరిలో ఏర్పాటు చేస్తే అమరావతి భూములకు విలువ పెరిగి తను బాగా లాభపడొచ్చని భావించారు. దీంతో కేబినెట్లో తీర్మానం చేసి తరలించేశారు. అప్పట్లో వెనుకబడిన రాయలసీమలోనే ఉంచాలని ప్రజల నుంచి డిమాండ్ వచ్చినా పట్టించుకోలేదు.
2014 సంవత్సరంలో తెలుగుదేశం ఉమ్మడి అనంతపురం జిల్లాలో 12 సీట్లు గెలిచింది. అలాంటి జిల్లా అభివృద్ధిని బాబు గాలికొదిలేశారు. ఈ కరువు ప్రాంతాన్ని అస్సలు పట్టించుకోలేదు. విభజన చట్టంలోని 13వ షెడ్యూల్లో ఇచ్చిన హామీ మేరకు కేంద్రం 2018 సంవత్సరంలో రాష్ట్రానికి సెంట్రల్ యూనివర్సిటీని మంజూరు చేసింది. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలంలోని జంతులూరు గ్రామంలో కట్టాలని నిర్ణయించారు. అయితే దీని విషయంలో అప్పట్లో చంద్రబాబు రాజకీయాలు చేశారు. రాయలసీమకు ఆ వర్సిటీ అవసరం లేదని, అక్కడ భూములు ఇచ్చేది లేదని, అమరావతికి మార్చాలని కేంద్రంతో లాబీయింగ్ చేశారు. అమరావతిలో తన బినామీలు కొన్న భూముల వద్ద ఈ విశ్వవిద్యాలయాన్ని పెట్టాలని చూశారు. దీంతో ఆ స్థలాలకు రియల్ ఎస్టేట్‌లో మంచి ధర వస్తుందని స్కెచ్ వేశారు. కానీ బాబు పాచికలు పారలేదు.æరాయలసీమలో బాబు సర్కార్ భూములు ఇవ్వడం లేదని కేంద్రం ఆనాడు వర్సిటీ నిర్మాణం గురించి పట్టించుకోలేదు. తర్వాత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భూములిచ్చి వర్సిటీ నిర్మాణాన్ని పూర్తి చేయించారు.
సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో బాబు ఫెయిలైనా ఎయిమ్స్ విషయంలో వెనక్కి తగ్గలేదు. కుల రాజధానిలోనే ఇది ఉండాలని పట్టుబట్టారు. వాస్తవానికి అనంతపురం అన్ని రంగాల్లో బాగా వెనుకబడిన జిల్లా. ఇక్కడి నుంచి వైద్య సదుపాయాల కోసం ఎక్కువగా బెంగళూరు వంటి ప్రాంతాలకు వెళ్తుంటారు. ఎయిమ్స్ ఏర్పాటై ఉంటే ఒక్క అనంతపురం జిల్లా ప్రజలకే కాకుండా మిగిలిన సీమ వాసులకు ఎంతో ఉపయోగకరంగా ఉండేది. కానీ అలా జరగలేదు. సీమతో పోల్చుకుంటే గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఆస్పత్రులు ఎక్కువగా ఉంటాయి. వైద్యం అందుబాటులో ఉంటుంది. కానీ కుల పిచ్చితో, రియల్ ఎస్టేట్ బూమ్ కోసం నారా వారు ఎయిమ్స్‌ను మంగళగిరికి తరలించేశారు. సీమ ద్రోహి అనే పేరును సార్థకం చేసుకున్నారు.