మనసులో ఉంది కక్కేయడం.. దానిపై ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తంగా కాగానే.. కవర్ చేసుకోవడానికి ప్రయత్నించడం తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి అలవాటే. అనంతపురం జిల్లా శింగనమల అసెంబ్లీ అభ్యర్థిగా వైఎస్సార్సీపీ టికెట్‌ను వైఎస్ జగన్మోహన్రెడ్డి వీరాంజినేయులు అనే దళితుడికి ఇచ్చారు. ఇతను పేదవాడు. ఎంఏ, బీఈడీ చదివాడు. కుటుంబ పోషణ కోసం టిప్పర్ డ్రైవర్‌గా వెళ్తున్నాడు. ఇలాంటి వారికి సీట్లు ఇచ్చి ప్రోత్సహించి చట్టసభలకు తీసుకెళ్లాలని జగన్ ప్రయత్నిస్తుంటే చంద్రబాబు మాత్రం చులకనగా మాట్లాడారు.
శింగనమల ప్రజాగళంలో టిప్పర్ డ్రైవర్‌కు వైఎస్సార్సీపీ టికెట్ ఇచ్చిందని, అతను చదువుకోలేదని బాబు అన్నారు. పేదలు ఎన్నికల్లో పోటీ చేసేందుకు పనికిరారనే ధోరణిలో మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకిత వచ్చింది. ముఖ్యంగా డ్రైవర్లయితే కన్నెర్ర చేశారు. దీంతో తెలుగుదేశం పార్టీ భయపడిపోయింది. ఎన్నికల్లో నష్టపోతామని ఆందోళన చెంది దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. చంద్రబాబు అతి పెద్ద డ్రైవర్ అని బొమ్మలు వేయించి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది. ఆప్కీడైవ్రర్బాబు అంటూ ట్విట్టర్లో హ్యాష్‌ట్యాగ్‌తో ట్రెండింగ్ చేసే పనిలో ఆ పార్టీ ఐటీ విభాగం నిమగ్నమైంది.
పగ్గాలు చేతికిస్తే ఏపీని ప్రగతి బాటలో పరుగులు పెట్టించగల దమ్మున్న డ్రైవర్ చంద్రబాబు, ఏపీ ప్రజల సంక్షేమ బస్సుకు చంద్రబాబే సరైన డ్రైవర్, వ్యవస్థలను కలుషితం చేస్తున్న వైసీపీ రౌడీ సంస్కృతిని ఊరవతల పాతరేసే పారిశుద్ధ్య కార్మిక డ్రైవర్, యువత భవితను సరైన బాటలో నడిపించగల డైనమిక్ డ్రైవర్, పెద్ద కొడుకులా కష్టపడతాడు.. భరోసా బండిని నడిపిస్తాడు.. ఇలా పోస్టులు పెట్టారు. డ్రైవర్లను హేళనగా మాట్లాసి.. ఇప్పుడు బాబును మించిన డ్రైవర్ లేడంటే ఎలా నమ్మాలని ప్రజానీకం ప్రశ్నిస్తోంది.
ఇలా కవర్ డ్రైవ్‌లు చేయడం టీడీపీకి కొత్త కాదు. దళితులు, బీసీలను చులకనగా మాట్లాడిన చరిత్ర చంద్రబాబుది. వారి నుంచి వ్యతిరేకత రావడంతో మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు ఎన్డీఏలో చేరడంతో ముస్లింలు ఆయనపై మండిపోతున్నారు. దీనిని కవర్ చేయడానికి ప్రతి సభలో కార్యకర్తల చేత నారా హమారా అంటూ ప్లకార్డులు ప్రదర్శింపజేస్తున్నారు. డ్రైవర్ సీట్లో కూర్చొన్నట్లు బొమ్మలేయించుకుని క్యాప్షన్లు రాయించుకునేస్తే మరిచిపోతారులే అనుకుంటే కరెక్ట్ కాదు.. మనసు మంచిదై ఉండాలి. ఓట్ల కోసం నాటకాలు ఆడితే ఇట్టే తెలిసిపోతుంది.