2003-04 సంవత్సరంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు కేవలం ఐఎంజీ భారత్ కంపెనీ ఏర్పాటైన 4 రోజుల్లోనే వేల కోట్ల విలువచేసే 400 ఎకరాలకు కట్టబెట్టారు.
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు తన 9ఏళ్ల పాలనలో యథేచ్ఛగా సాగిన స్కాముల పుట్ట నేడు పగలడానికి సిద్దంగా ఉందా అంటే అవుననే సమాధానం వస్తుంది. 2003-04 సంవత్సరంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు కేవలం ఐఎంజీ భారత్ కంపెనీ ఏర్పాటైన 4 రోజుల్లోనే వేల కోట్ల విలువచేసే 400 ఎకరాలకు కట్టబెట్టారు. ఇలా ఆ సంస్థకు భూమిని కట్టబెట్టడం వెనుక వేల కోట్లు చేతులు మారాయని ఆనాడే అనేక ఆరోపణలు వచ్చాయి.
అయితే నేడు అత్యంత ఖరీదైన ప్రాంతంలో వేల కోట్ల విలువైన భూములను కారు చౌకగా ధారాదత్తం చేస్తారా? అంటూ ధర్మాసనం మండిపడింది. ఐఎంజీ భారత్కు భూముల అప్పగింతపై సీబీఐ విచారణ కోరుతూ గతంలో లేఖ రాశాం అన్నారు,ఎంత వరకు వచ్చింది? మీరు విచారణ కోరతారా? లేక మమ్మల్నే సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు ఇవ్వమంటారా? అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. తదుపరి విచారణలోగా ఏదో ఒకటి చెప్పాలని ఆదేశిస్తూ, విచారణను వారం పాటు వాయిదా వేసింది.
ఈ కేసు సీబీఐకి వెళితే ఒక్క ఐఎంజీ భారత్కు భూముల అప్పగింత వరకే పరిమితం అవ్వదని ఈ కుంభకోణంతో లింక్ గా సాగిన అనేక కుంభకోణాలు బయటికి వస్తాయని తెలుస్తుంది. ఇలా బయటికి వచ్చే కుంభకోణంలో మొదటి వరసలో ఉండేది ఇజ్రాయిల్ టెక్నాలజీ వ్యవసాయ కుంభకోణం . ఇజ్రాయిల్ టెక్నాలజీ వ్యవసాయాన్ని ఒక సారి లోతుగా పరిశీలిస్తే భారీ కుంభకోణమే బయట పడుతుంది.
ఇది బాబు ఇజ్రాయిల్ టెక్నాలజీ బాగోతం
చంద్రబాబు తనను మూడు దశాబ్దాలుగా ఎమ్మెల్యేగా ఎన్నుకుంటున్న అమాయక కుప్పం రైతులను స్కాం కి ముడి సరుకుగా వాడేసారు. భూసారాన్ని బట్టి సంప్రదాయ పంటలు పండించుకుంటున్న కుప్పం నియోజకవర్గ రైతులకు ఇవేమీ వద్దంటూ ఆధునిక వ్యవసాయం చేసి చూపిస్తామన్నారు. ఇజ్రాయెల్ సాంకేతిక పరిజ్ఞానం అంటూ గారడీ చేసి అర్ధంతరంగా మధ్యలోనే వదిలేశారు. ఫలితంగా చాలామంది రైతులు దెబ్బతిన్నారు. ఆ సంగతేమిటో కాస్త వివరంగా చూద్దాం రండి..
కుప్పం నియోజకవర్గంలోని రైతులకు 1999లో అప్పటి ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యే చంద్రబాబు ఇజ్రాయెల్ ఆధునిక వ్యవసాయాన్ని పరిచయం చేశారు. పంటలకు ఎంత నీరు అవసరమో.. ఆ మేరకు డ్రిప్ ఇరిగేషన్ విధానంతో సేద్యాన్ని ప్రారంభిస్తున్నామని ఆర్భాటంగా ప్రకటించారు. సాంకేతికతను రైతులకు పరిచయం చేసి వారు ఆధునిక సేద్యం వైపు మళ్లేలా ఇజ్రాయెల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామని వెల్లడించారు. ఆ క్రమంలోనే తొలిసారిగా రామకుప్పం మండలంలోని చెల్దిగానిపల్లె వద్ద 200 ఎకరాల్లో డెమో ప్రాజెక్టును ఏర్పాటు చేశారు.
ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆధునిక పరికరాలు, తక్కువ నీరు, భూమి వినియోగంతో నాణ్యత కలిగిన అధిక దిగుబడులు పొందవచ్చని చెప్పుకొచ్చారు. జపాన్ గ్రాంటుగా అందించిన రూ.10 కోట్లతో 1,600 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. ఆ తర్వాత కుప్పం, రామకుప్పం, గుడుపల్లె, వి.కోట మండలాల్లో 10వేల ఎకరాల్లో ఇజ్రాయెల్ సేద్యం విస్తరణకు చర్యలు చేపట్టారు. ఈ వ్యవసాయానికి ఒప్పందం కుదుర్చుకున్న రైతుల భూ పత్రాలను బ్యాంకుల్లో తనఖా పెట్టి రుణాలను ఇప్పించారు. కానీ రైతులకు నాసిరకమైన సబ్సిడీ వ్యవసాయ పరికరాలను పంపిణీ చేశారు. ఫలితంగా పండించిన పంటలలో లాభాలు రాకపోవడంతో రైతులు నష్టపోయారు. బ్యాంకుల్లో ఉన్న భూముల పత్రాలను విడిపించుకోలేక అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. పైగా ఆ సాంకేతిక పరిజ్ఞానంతో భూసారం తగ్గిపోయిందని కొంతమంది రైతులు ఇప్పటికీ గగ్గోలు పెడుతున్నారు.
బీహెచ్సీ కంపెనీ ఎవరిదంటే..
ఇక రైతులకు పదేళ్ల పాటు సాంకేతిక పరిజ్ఞానం అందిస్తామంటూ రూ.కోట్లలో కాంట్రాక్టు తీసుకుని మధ్యలోనే వెళ్లిపోయిన ఇజ్రాయెల్ సంస్థ బీహెచ్సీ(బ్రైట్ హషిత కంపెనీ) చంద్రబాబు బినామీలదేనన్న ప్రచారం బలంగా సాగింది. ఆయన ఆపద్ధర్మ సీఎంగా ఉన్న సమయంలో కూడా ఈ సంస్థకు నిధులు విడుదల చేయడంపై ఆరోపణలకు బలం చేకూరింది. బీహెచ్సీకి ఏటా 2.80 కోట్లను కన్సల్టెన్సీ ఫీజుగా చెల్లించారు. 2004లో చంద్రబాబు ఆపద్ధర్మ సీఎంగా దిగిపోయే చివరి రోజుల్లో కూడా ఈ సంస్థకు 1.50 కోట్లను చెల్లించారు. ఇప్పుడు హైదరాబాద్ ఐఎంజీ భూముల కుంభకోణంలో ప్రధానంగా పేర్లు వినిపిస్తున్న ఢిల్లీరావు, పేట్రావ్లకు చెందినదే ఈ బీహెచ్సీ కంపెనీ అనే ఆధారాలు బలంగానే ఉన్నాయి.
రైతులు నష్టాల్లో కూరుకుపోయిన పరిస్థితుల్లో ఉంటే.. ఇజ్రాయెల్ సంస్థ బీహెచ్సీ(బ్రైట్ హషిత కంపెనీ) అర్ధంతరంగా మాయమైంది. బిందు సేద్యం అమలుకు సాంకేతిక సాయం చేస్తామని చెప్పుకొచ్చిన కంపెనీ ప్రకటన మేరకు అప్పటి అధికారులు రామకుప్పం మండలం చెల్దిగానిపల్లె, శివునికుప్పం, ఎల్లాగ్రామం, బైపరెడ్లపల్లిలో అనేక మంది రైతుల నుంచి సుమారు 200 ఎకరాల భూములను సేకరించారు. ఆ విధానాన్ని అమలు చేసేందుకు రైతుల నుంచి సేకరించిన భూములకు సదరు కంపెనీ నగదు చెల్లిస్తుందని ప్రకటించారు. ఒక్కో రైతు నుంచి భూమిని సేకరించి పదేళ్లకు లీజు రాసుకున్నారు.
మొదట్లో ఎకరాకు రూ.లక్ష చెల్లిస్తామని నమ్మబలికారు. ఆ తర్వాత ఎకరాకు 15 వేలు మాత్రమే చెల్లిస్తామని చెప్పారు. చివరికి ఆ నగదును సైతం ఎగ్గొట్టారు. ఇదేమిటని ప్రశ్నించిన రైతులకు ఖాళీగా ఉన్న బీడు భూములను వ్యవసాయానికి ఉపయోగపడేలా చేశామని చెప్పి చేతులు దులుపుకున్నారు. వాస్తవానికి పదేళ్లు ఉంటామని చెప్పిన ఇజ్రాయెల్ కంపెనీ ముందుగానే ఉడాయించింది. ఈ వ్యవహారం, రైతులు నష్టపోయిన నేపథ్యంపై 2006వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చలపతి కమిషన్ నియమించారు. ఆ కమిషన్ క్షేత్ర స్థాయిలో జరిగిన అవకతవకవలను గుర్తించి నివేదికలు అందించింది. అయితే కమిషన్ నివేదిక అమలు కాకుండా బాబు వ్యవస్థలను ఉపయోగించి అడ్డుకున్నారు. ఇది బాబు ఇజ్రాయిల్ టెక్నాలజీ బాగోతం.. . ఇప్పుడు సీబీఐ దర్యాప్తు ప్రారంభం అయితే ఇజ్రాయిల్ టెక్నాలజీ బాగోతం పుట్ట కూడా పగలడం ఖాయంగానే కనిపిస్తుంది.