గంటా శ్రీనివాసరావు. టీడీపీలో సీనియర్ నేత. పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే ఎంపీగా గెలిచి, అనంతరం 4 సార్లు ఎమ్మెల్యేగా వివిధ నియోజకవర్గాల్లో గెలుపొందారు. రెండు పర్యాయాలు మంత్రిగా కూడా పని చేశారు. కానీ ఆయనకు టీడీపీ ప్రకటించిన మూడు జాబితాల్లోనూ చోటు దక్కలేదు. అసలు సీటు దక్కుతుందో లేదో అన్న గ్యారెంటీ కూడా లేదు. దీంతో ఆయన అసహనంతో ఉన్నట్లు సమాచారం.
వాస్తవానికి 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలై 23 సీట్లకే పరిమితమైనా గంటా శ్రీనివాసరావు టీడీపీలో విజయం సాధించారు. అనంతరం పార్టీ మారేందుకు అనేక ప్రయత్నాలు కూడా చేశారు. కానీ ఆ ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో టీడీపీలోనే ఉండిపోయారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాజీనామా చేస్తున్నట్లు చిన్నపాటి డ్రామా కూడా ఆడారు. ఇవన్నీ గమనిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు గంటా శ్రీనివాసరావు తీరు మింగుడుపడలేదు. అందుకే తగిన సమయం కోసం ఎదురుచూస్తూ వచ్చారు. ఎన్నికల హడావిడి మొదలుకావడంతో భీమిలిలో పోటీకి గంటా శ్రీనివాసరావు రంగం సిద్ధం చేసుకుంటూ గ్రౌండ్ వర్క్ చేశారు.
కానీ గంటాకు తగిన బుద్ది చెప్పాలని భావించిన చంద్రబాబు చీపురుపల్లి నుండి పోటీ చేయాల్సిందిగా గంటాను ఆదేశించారు. బొత్స సత్యనారాయణకు వ్యతిరేకంగా పోటీ చేసి గెలవడం కష్టమని భావించిన గంటా శ్రీనివాసరావు అందుకు ససేమిరా అని చంద్రబాబు ఆదేశాన్ని ధిక్కరించారు. తాను చీపురుపల్లినుండి పోటీ చేయడం కుదరదని చంద్రబాబుకు తేల్చిచెప్పడంతో చంద్రబాబు గంటాపై సీరియస్ అయ్యారని వార్తలు వచ్చాయి. పొత్తులో భాగంగా ఇప్పటికే మూడు జాబితాల్లో 139 మంది అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించారు. ఇంక మిగిలినవి కేవలం ఐదు సీట్లే కావడంతో ఈసారి ప్రకటించే చివరి జాబితాలో అయినా గంటా పేరు ఉంటుందో ఉండదో అన్న సందేహాలు మొదలయ్యాయి. మరి చంద్రబాబు గంటాకు అవకాశం ఇస్తారా లేక దేవినేని ఉమా లాగ పక్కన పెట్టేస్తారా అనేది త్వరలో ప్రకటించే జాబితా ద్వారా తేటతెల్లమవుతుంది.