మూల ధన వ్యయం అంటే ఆస్తుల కల్పన వ్యయంగా కాగ్ పరిగణిస్తుంది. మూలధన వ్యయం యొక్క అర్థం దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ఒక సంస్థ చేసే ఖర్చులను మూలధన ఖర్చులు అంటారు. ఈ ఖర్చులు సంస్థకు కొత్త ఆస్తులను మెరుగుపరచడం లేదా జోడించడం ద్వారా దీర్ఘకాలిక ఆస్తి యొక్క సామర్థ్యాన్ని లేదా సామర్థ్యాలను పెంచడానికి ఉపయోగపడతాయి.
రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్లలో మూల ధన వ్యయం 87,972 కోట్లు ఖర్చు చేసినట్లు కాగ్ అకౌంట్స్ తెలిపాయి. 2023-24 ఆర్థిక ఏడాదికి సంబంధించి ప్రాథమిక అకౌంట్స్‌ను కాగ్ వెల్లడించింది. 2023-24 ఆర్థిక ఏడాదిలో 23,589 కోట్లు మూల ధన వ్యయం చేసినట్లు పేర్కొంది. గత టీడీపీ ప్రభుత్వ హాయం కంటే ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్ర సంపద సృష్టికి ఎక్కువ వెచ్చించినట్టు తెల్పింది, టీడీపీ హయాం చూస్తే మూలధన వ్యయం కింద ఏడాదికి 15,227 కోట్లు ఖర్చుచేస్తే… ప్రస్తుత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏడాదికి 17,757 కోట్లు ఖర్చు చేసినట్టు పేర్కొంది.
ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల వ్యయం బడ్జెట్ కేటాయింపులకు మించి అయినట్లు కాగ్ గణాంకాలు తెలిపాయి. 2023-24 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో ఉద్యోగుల వేతనాల కోసం 50,882 కోట్లు కేటాయించగా 52,010 కోట్లు వ్యయం అయ్యాయని, పెన్షన్ కోసం బడ్జెట్లో 21,183 కోట్లు కేటాయించగా 21,694 కోట్లు వ్యయం అయ్యాయని పేర్కొంది. సామాజిక రంగం వ్యయంలో (విద్య, వైద్యం, మంచినీటి సరఫరా, ఎస్సీ, ఎస్టీ తదితర సంక్షేమాలకు) 1,10,375 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపింది.
సాధారణ సేవలకు 67,281 కోట్లు, ఆర్థిక సేవలకు 57,344 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించింది. 2023-24 ఆర్థిక ఏడాది మొత్తం బడ్జెట్ కేటాయింపుల్లో 91.97% వ్యయం చేసినట్లు తెలిపింది. 2023-24 ఆర్థిక ఏడాదిలో రెవెన్యూలోటు 37,468 కోట్లు ఉండగా ద్రవ్యలోటు 61,765 కోట్లుగా ఉన్నట్లు వెల్లడించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో రెండేళ్లు కోవిడ్ ఉంది. ఆ రెండేళ్లూ రాష్ట్ర ఆదాయం తగ్గినా కూడా మూలధన వ్యయం కింద భారీగా ఖర్చు చేయగలిగింది. కొత్తగా 4 సీపోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, వీటితోపాటు 17 మెడికల్ కాలేజీలు, ‘నాడు–నేడు’తో స్కూళ్లు, ఆసుపత్రుల రూపురేఖలు మారుస్తుంది, వీటిపై ప్రభుత్వం అత్యధికంగా వెచ్చించిన విషయం మన అందరకి తెలిసిందే.