ముఖ్యమంత్రి జగన్ పాలనలో అనేక రంగాలలో అగ్రగామిగా దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ ఇంధన సామర్ధ్య అవార్డును కూడా దక్కించుకుంది. దాంతో వరుసగా రెండో ఏడాది కూడా ఈ అవార్డును దక్కించుకుని ఏపీ రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిసిన ఇంధన శాఖ ఉన్నతాధికారులు అవార్డు వివరాలు తెలిపారు.
వివరాల్లోకి వెళితే ప్రతిష్టాత్మక నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు 2023ని దక్కించుకున్న రాష్ట్రంగా ఏపీ నిలిచింది. గతేడాది కూడా ఈ అవార్డు ఏపీనే వరించడం గమనార్హం. ఇటీవల న్యూఢిల్లీలో భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డును అందుకున్న ఆంధ్రప్రదేశ్ అధికారులు అందుకున్నారు. కాగా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ను ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె. విజయానంద్, ఏపీ జెన్కో ఎండీ కె.వి.ఎన్ చక్రధర్ బాబు,ఏపీ ట్రాన్స్కో జేఎండీ (విజిలెన్స్, సెక్యూరిటీ) బి.మల్లారెడ్డి, ఏపీఎస్ఈసీఎం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బీఏవీపీ కుమారరెడ్డి కలిసి అవార్డు వివరాలు వెల్లడించారు. ముఖ్యమంత్రి జగన్ అధికారులను అభినందించారు.