కేశినేని శ్రీనివాస్.. అలియాస్ కేశినేని నాని ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో సంచలనంగా మారారు. ఆయన బుధవారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో భేటీ కావడం హాట్ టాపిక్‌గా మారింది.
బెజవాడ రాజకీయాల్లో కేశినేని నానీకి ప్రత్యేక శైలి ఉంది. ట్రావెల్స్ నడుపుతూ 2008 సంవత్సరంలో ప్రజారాజ్యంలో చేరిన ఆయన తక్కువ వ్యవధిలోనే తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. 2014, 2019లో విజయవాడ ఎంపీగా గెలిచారు. చంద్రబాబు భజన బృందం చాలాకాలంగా కేశినేనికి పొగ పెడుతూ వస్తోంది. పార్టీ కోసం ఎంతగానో కష్టపడిన వ్యక్తిని తరిమేయాలని ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా అనేకసార్లు మాటల యుద్ధాలు జరిగాయి. నాని పార్టీ, చంద్రబాబు తీరుపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. విజయవాడ ఎంపీ టికెట్‌ను ఈసారి నానీకి ఇవ్వకూడదని టీడీపీ అధిష్టానం నిర్ణయించింది. ఈ విషయాన్ని బాబు తన దూతల ద్వారా కేశినేనికి చెప్పించారు. దీంతో నానీ పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఆయన కుమార్తె కేశినేని శ్వేత కార్పొరేటర్ పదవికి, పార్టీకి రాజీనామా చేశారు.
ఎంతో చేసినా..
2019లో టీడీపీ దారుణంగా ఓటమి చెందింది. ఈ సమయంలో కృష్ణా జిల్లాలో ఆ పార్టీ ఉనికి కోసం నాని చాలా కష్టపడ్డారు. తన సొంత వ్యాపారాలను పక్కన బెట్టి పనిచేశారు. పార్టీ కోసం ఆస్తులు అమ్ముకున్నానని, వ్యాపారాలు వదులుకున్నానని సీఎంను కలిసిన తర్వాత విలేకరులకు నాని చెప్పారు. టీడీపీ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, నాయకులు నిత్యం ప్రెస్మీట్లు పెట్టి నానీని టార్గెట్ చేసినా చంద్రబాబు పట్టించుకోలేదు. ఆయన ఎప్పుడెప్పుడు పార్టీని వదిలి వెళ్తారా అనే రీతిలో వ్యవహరించారు. తనను చెప్పుతీసుకొని కొడతానని ఓ క్యారెక్టర్ లెస్ వ్యక్తి తిట్టినా పార్టీ స్పందిచలేదని నాని ఆవేదన చెందారు. తనను గొట్టంగాడు అన్నా భరించానన్నారు. విజయవాడ మేయర్ అభ్యర్థిగా తన కుమార్తె శ్వేతను చంద్రబాబాబే నిర్ణయించారని.. ఆయన మూడు రోజులు అడిగితేనే ఆమె ముందుకొచ్చిందని తెలిపారు. ఆ తర్వాతే ప్రెస్మిట్ పెట్టించి తనను బాబు తిట్టించారని గుర్తు చేశారు. సొంత పార్టీ నేతలే తనను అవమానించినా పార్టీ చర్యలు తీసుకోలేదని, తనను ఎవరు ఎన్ని మాటలన్నా పార్టీ నుంచి కనీస మద్దతురాలేదని బాధపడ్డారు. తనను చాలా రకాలుగా అవమానించారని, టీడీపీలో ఉంటూ ఇంకా ఎన్ని భరించాలని ప్రశ్నించారు. ఇష్టం లేకపోతే వెళ్లిపోతానని అప్పుడే చంద్రబాబుతో చెప్పానని, నువ్వు ఉండాల్సిందేనని ఆయన నాతో అన్నారని నాని చెప్పారు. టీడీపీ కోసం సమయం, డబ్బు వృథా చేసుకోవద్దని చాలామందే చెప్పారని, అయినా టీడీపీలోనే కొనసాగానని, తాను అమ్ముకున్న ఆస్తుల విలువ రూ.2 వేల కోట్లన్నారు. కుటుంబంలో చిచ్చు పెట్టారని, నా కుటుంబ సభ్యులతో కొట్టించాలని నారా లోకేశ్ ఎందుకు చూశాడని నిలదీశారు. నేను అమరావతి కడతానని బాబు గొప్పలు చెప్పారని, విజయవాడS రియాలిటీ, అమరావతి ఒక కల కేశినాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు మోసగాడు అని ప్రపంచానికి తెలుసని, మరీ ఇంత పచ్చిమోసగాడు, దగా చేస్తాడని తెలీదని నాని ఆవేదన చెందారు. చంద్రబాబు ఏపీకి పనికీ రాని వ్యక్తి అన్నారు. రాజీనామా ఆమోదం పొందగానే వైఎస్సార్సీపీలో చేరుతానని ప్రకటించారు. ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీ 60 శాతం ఖాళీ అవబోతుందని ప్రకటించారు.
పార్టీకి ఎంతో నిబద్ధతతో పనిచేసిన నాని విషయంలో చంద్రబాబు వ్యవహరించిన తీరును చూసి విజయవాడ టీడీపీ కార్యకర్తలే ఆశ్చర్యపోతున్నారు. ఇలా చేసుండాల్సింది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భజన బృందం కోసం ముఖ్య నేతల్ని వదులుకుంటుండటం బెజవాడ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మొత్తంతా చంద్రబాబు, లోకేశ్ దృష్టిలో నాని కూడా ఒక కరివేపాకేనని తేలిపోయింది.