స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవగా ఆయన హైకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. గత సంవత్సరం నవంబర్ 20వ తేదీన ఇచ్చిన ఈ బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. జస్టిస్ బేం.త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ ప్రారంభమయ్యాక ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ కేసును వినాలని జడ్జిలను కోరారు.
అయితే సెక్షన్ 17ఏ వర్తింపు విషయంలో ఈనెల 16న విభిన్న తీర్పు రావడం.. ప్రధాన న్యాయమూర్తికి నివేదించడంతో బాబు తరఫు న్యాయవాదులు గుంటూరు ప్రమోద్ కుమార్, ప్రేరణ కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కావాలని అడిగారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల 5వ తేదీకి వాయిదా వేయాలని ముకుల్ రోహత్గీ కోరారు. బాబు తరఫున వచ్చిన సీనియర్ లాయర్ హరీశ్ సాల్వే 9వ తేదీకి వాయిదా ఇవ్వాలని అడిగారు. ఆరోజు తాను రాలేనని 12వ తేదీకి వాయిదా వేయాలని ప్రభుత్వం తరఫున హాజరైన మరో సీనియర్ న్యాయవాది రంజిత్‌కుమార్ కోరారు. ఈ నేపథ్యంలో విచారణను కోర్టు ఫిబ్రవరి 12వ తేదీకి వాయిదా వేసింది. ఆలోపు ఇరుపక్షాలు తమ లిఖితపూర్వక వాదనలు సమర్పించాలని ఆదేశించింది. క్వాష్ పిటిషన్‌ను కొట్టేస్తారని బాబు అండ్ కో భావించగా అలా జరగలేదు. ఇద్దరు సుప్రీం జడ్జిలు 17ఏపై మాత్రమే ఏకాభిప్రాయానికి రాలేదు. కేసును వాళ్లు సమర్థించిన విషయం తెలిసిందే.