చంద్రబాబు పుట్టి పెరిగింది రాయలసీమలోని చిత్తూరు జిల్లా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఆయన సీమకు చేసింది శూన్యం. దశాబ్దాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గానికి ఏమైనా చేశాడా అంటే అదీ లేదు. అయితే మాటలు మాత్రం కోటలు దాటిస్తుంటాడు. పుట్టిన ప్రాంతానికి ఏమి చేయలేకపోయానని బాధపడకుండా నిద్ర లేచింది మొదలు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాయలసీమ ద్రోహి అని తిడుతుంటాడు. కమలాపురం రా.. కదలిరా సభలో మళ్లీ ఈ మాట అన్నారు. కానీ నిజమైన ద్రోహి చంద్రబాబేనని అక్కడి ప్రజలందరికీ తెలుసు.
ఏ విధంగా అంటే..
బాబు తన పదవీ కాలంలో సీమలో ఒక్క తాగు, సాగునీటి ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేకపోయాడు. పునాదిరాళ్లు వేసి నిధులు కేటాయించకుండా చోద్యం చూశాడు. హంద్రీ – నీవా ఎత్తిపోతల పథకానికి రెండుసార్లు శంకుస్థాపన చేసిన బాబు పనులు మాత్రం చేయించలేకపోయాడు. 40 టీఎంసీల ప్రాజెక్టును 4 టీఎంసీలకు కుదించిన చరిత్ర బాబుది. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయ్యాక నిధులు కేటాయించి ప్రాజెక్టులో 80 శాతం పనులు పూర్తి చేయించారు. వైఎస్సార్ హయాంలోనే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెరిగింది. దీని వల్లే నేడు రాయలసీమకు సాగు, తాగునీరు అందుతున్న విషయం నిజం. సామర్థ్యాన్ని పెంచడంపై ధర్నా చేసిన దేవినేని ఉమను ఇరిగేషన్ శాఖ మంత్రి చేసిన చరిత్ర చంద్రబాబుది. గాలేరు – నగరి, హంద్రీ – నీవాకు టీడీపీ హయాంలో ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు. తమిళనాడుతో ఒప్పందం మేరకు తెలుగుగంగకు 1984లో రూపకల్పన జరిగింది. సుదీర్ఘ కాలంలో రూ.1,700 కోట్లు ఖర్చు చేయగా 2004–09 మధ్య వైఎస్సార్ రూ.2,500 కోట్లు ఖర్చు పెట్టారు. తెలుగుగంగ, గాలేరు – నగరి, గండికోట, బ్రహ్మంసాగర్ తదితర ప్రాజెక్టుల్లో టీడీపీ పాత్ర శూన్యం. కర్నూలు జిల్లాలో ముచుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్‌ను బాబు 5 శాతం కూడా పూర్తి చేయలేదు. ఆనాడు జలయజ్ఞంలో భాగంగా వైఎస్సార్ నిధులిచ్చి పూర్తి చేయించారు. చంద్రబాబు అనేకవాటిని గాలికొదిలేస్తే రాజన్న పూర్తి చేసి రైతాంగానికి అండగా నిలిచారు. అయితే బాబు మాత్రం తానే అంతా చేసినట్లు డబ్బా కొడుతుంటాడు. ఎల్లో మీడియా వంత పాడుతుంది.
పూర్తి చేసి చూపించారు..
వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక వెయ్యి కోట్ల రూపాయల ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని జగన్ ఇవ్వడంతో సీమకు గుండెకాయ లాంటి గండికోటలో పూర్తిస్థాయి సామర్థ్యంతో నీరు నిల్వ చేసే పరిస్థితి ఏర్పడింది. గతంలో ఆరు టీఎంసీలు కూడా నిల్వ చేయలేని స్థితి నుంచి నేడు 26 టీఎంసీలు నిల్వ చేసే స్థాయికి చేరింది.
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో..
రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో బాబు వ్యవహరించిన తీరు సీమ వాసుల్ని తీవ్ర కలత చెందేలా చేసింది. కృష్ణా నది జలాల్లో తమ వాటాగా దక్కిన నీటిని వినియోగించుకోవడం ద్వారా రాయలసీమ, నెల్లూరు జిల్లాలో తాగు, సాగునీటి కష్టాలను తీర్చాలని చేపట్టిన పథకం ఇది. ఎన్నో దశాబ్దాల కల అయిన ఈ ప్రాజెక్టు విషయంలో సీఎం జగన్ ఎంతో సంకల్పంతో ఉన్నారు. హంద్రీ – నీవా కంటే ఇది చాలా పెద్దది. కర్నూలు జిల్లాలోని సంగమేశ్వర వద్ద పనులుప్రారంభించారు. అయితే దీనిపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. కేంద్ర జలశక్తి సంఘానికి, కోర్టుకు వెళ్లి ఈ ప్రాజెక్టును ఎలాగైనా అడ్డుకోవాలని అక్కడి నాయకులు ప్రయత్నించారు. కృష్ణా జలాల్లో మన వాటాను వినియోగిచడంలో తప్పు లేదని భావించి ప్రజలంతా మద్దతు ఇస్తే బాబు మాత్రం స్పందించలేదు. రాయలసీమకు మంచి చేసే ప్రాజెక్టు విషయంలో నోరు మెదపని నారా వారు కదా నిజమైన సీమ ద్రోహి.
వెలిగొండ ప్రాజెక్టు విషయంలో..
పూల పుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు.. ప్రకాశం, నెల్లూరు, సీమలోని వైఎస్సార్ కడప జిల్లాల్లో దుర్భిక్ష ప్రాంతాల ప్రజల స్వప్నం ఇది. 1996లో లోక్‌సభ ఎన్నికల గండాన్ని గట్టేందుకు చంద్రబాబు దీనికి హడావుడిగా శంకుస్థాపన చేశారు. 2004 వరకు ఆయన కేవలం రూ.10 లక్షలు మాత్రం ఖర్చు పెట్టారు. అది కూడా శంకుస్థాపన కోసమే. ఏనాడు రూపాయి విదల్చలేదు. వైఎస్సార్ 2004లో సీఎం అయ్యాక లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు దీని పనులకు శ్రీకారం చుట్టారు. జలయజ్ఞంలో భాగంగా రూ.3,581.57 కోట్లు ఖర్చు చేసి నల్లమల సాగర్‌తోపాటు సొరంగాల్లో సింహభాగం పనులు పూర్తి చేయించారు. సొరంగాలను నల్లమల సాగర్‌తో అనుసంధానించి 11,585 క్యూసెక్కులను తరలించేలా ఫీడర్ ఛానల్ పనులు చేయించారు. ఆయన మరణానంతరం పనులను ఎవరూ పట్టించుకోలేదు. 2014లో సీఎం అయిన బాబు వెలిగొండను కామధేనువుగా మార్చుకున్నాడు. కాంట్రాక్టర్లకు అప్పనంగా దోచిపెట్టాడు. 2019లో సీఎం అయిన జగన్ వెలిగొండను పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు. చిత్తశుద్ధితో వ్యవహరించడంతో నేడు ఈ ప్రాజెక్టు పనులు తుదిదశకు చేరుకున్నాయి. బాబు తన నియోజకవర్గం కుప్పానికి నీళ్లు ఇవ్వలేకపోయాడు. కానీ జగన్ చేసి చూపించాడు. ఇలా చెప్పుకొంటూపోతే చాలా ఉన్నాయి. బాబు సీమను పట్టించుకోకపోయినా వైఎస్సార్, ఆయన తనయుడు జగన్ చాలా మంచి చేశారు. ప్రాజెక్టులను వారు పూర్తి చేస్తే చంద్రబాబు అంతా నేనేనంటూ అబద్ధాలు చెబుతున్నాడు. కంటికి పనులు కనిపిస్తున్నా బాబు జగన్‌ను ద్రోహి అంటూ తాను అసలుసిసలు సీమ ద్రోహిగా మిగిలిపోయాడు.