ఎన్టీ రామారావు నాకు దైవం. ఆయన ఫొటో చూస్తే నేను అనుకున్న పని అయిపోతుంది. మామ ఆశయ సాధన కోసం కృషి చేస్తున్నానంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెబుతుంటారు. అయితే అలాంటి వ్యక్తికి భారతరత్న ఇప్పించేందుకు మాత్రం ఎటువంటి ప్రయత్నం చేయడు. కేంద్రంలో చక్రాలు తిప్పానని, ప్రధానులు, రాష్ట్రపతులను ఎంపిక చేశానని చెప్పుకొంటూ తిరిగే వ్యక్తి తన మామకు అత్యున్నత పురస్కారం ఇప్పించకలేకపోయాడు. తాజాగా నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఈ విషయంపై వ్యాఖ్యానించారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ఇచ్చారు. సంతోషమే. కానీ అంతకన్నా గొప్ప వ్యక్తిగా కీర్తించబడే ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వడం చంద్రబాబుకు ఏ మాత్రం ఇష్టం లేదన్నారు. గతంలో బాబు ఎన్డీఏలో భాగస్వామిగా ఉండి కూడా పురస్కారం ఇవ్వాలని కోరలేదని విమర్శించారు. ఎన్టీఆర్ టీడీపీ ఒరిజినల్. చంద్రబాబు పార్టీ నకిలీదన్నారు.
ఎమ్మెల్యే చెప్పింది నిజమే. బాబు పలుమార్లు ఎన్డీయేలో చేరారు. మంత్రి పదువులు తీసుకున్నారు. కేంద్రాన్ని శాసించానని చెప్పే వ్యక్తికి భారతరత్న ఇప్పించడం పెద్ద విషయం కాదు. కానీ అలా చేయలేదు. ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి రోజున మాత్రం పురస్కారం ఇవ్వాలని డిమాండ్ చేయడం మర్చిపోరు. 2019 నుంచి బీజేపీ భజన చేస్తున్న నారా వారు మామ కోసం ఆ ఒక్కటీ అడగలేకపోయారు. అదే జగన్ కొత్తగా ఎన్టీఆర్ జిల్లాను ఏర్పాటు చేస్తే ఓర్చుకోలేకపోయారు. పీవీకి భారతరత్న ప్రకటించిన నేపథ్యంలో రామారావు విషయంలో టీడీపీ అనుసరిస్తున్న వైఖరి చర్చనీయాంశమైంది. నందమూరి కుటుంబం దాదాపు చంద్రబాబు వైపే ఉంది. వారు కూడా ఆయనపై ఒత్తిడి చేయకపోవడం విశేషం. నిత్యం మా నాన్నగారంటూ పొగిడే బాలకృష్ణ కూడా తన వియ్యంకుడైన బాబును ఒక్క మాట అడిగిన పాపాన పోలేదు. సాక్షాత్తు ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి బీజేపీలో ఉన్నారు. ప్రస్తుతం ఏపీ అధ్యక్షురాలి హోదా అనుభవిస్తున్నారు. గతంలో పలు పార్టీ పదవులు చేపట్టారు. ఆమె కూడా బాబు బాటలోనే పయనిస్తున్నారు. తండ్రి భారతరత్న ఇవ్వాలని అడిగితే ఆమెకు నష్టం ఏమిటో..