వివేకానందరెడ్డి హత్య విషయంలో ఆయన కుమార్తె అల్లిన కట్టు కథలకు కడప ఎంపీ అవినాష్‌రెడ్డి స్పందించారు. మీడియా సమావేశంలో వాస్తవాలను బయటపెట్టారు. వివేకా హత్య జరిగిన 40 రోజుల తర్వాత దస్తగిరి సీబీఐ ముందు వాంగ్మూలమిస్తూ హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. సీబీఐ అతన్ని అరెస్ట్ చేయలేదు. పైగాS ముందస్తు బెయిలు వచ్చేలా సీబీఐ, సునీత సహకరించారు. 2021 అక్టోబరు 21న కోర్టులో దస్తగిరి ముందస్తు బెయిల్ పిటిషన్ వేస్తే సీబీఐ అభ్యంతరం లేదని చెప్పింది. సునీత అభ్యంతరం చెప్పలేదు. ముందస్తు బెయిల్ వచ్చేంత వరకూ వేచి ఉండి, ఆ తర్వాత అప్రూవర్ వ్యవహారాన్ని తీసుకొచ్చారు. ఐపీసీ 306(4)ఏ ప్రకారం అప్రూవర్ అయితే కోర్టులో విచారణ అయ్యే వరకు బెయిల్ రాదు. కాబట్టే బెయిల్ వచ్చిన తర్వాత 306 (4)బీ ప్రకారం అప్రూవర్‌గా మార్చారు. హంతకుడినని ఒప్పుకొన్న అతడిని అరెస్ట్ చేసి ఉంటే జీవిత కాలం బెయిల్ వచ్చేది కాదు. జీవిత కాలం ఈ కేసులో అరెస్ట్ ఉండదని హామీ ఇచ్చి, వారికి కావల్సిన పేర్లను అతనితో చెప్పించుకున్నారు. దస్తగిరి హియర్ సే ఎవిడెన్స్ అంటూ అప్పటి దర్యాప్తు అధికారి రామ్‌సింగ్, సునీత కలిసి కట్టుకథ అల్లారు. అందువల్లే నా తండ్రి చేయని నేరానికి ఏడాదిగా జైల్లో మగ్గుతున్నారు.
గూగుల్ టేకౌట్‌కు ఎలాంటి శాస్త్రీయతా లేదని ఈ సంస్థ చెప్పింది. సీబీఐ కూడా ఒప్పుకొంది. గ్రీన్విచ్ మీన్టైంకు ఇండియన్ స్టాండర్డ్ టైంకు తేడా లేకుండా సీబీఐ తప్పుడు ప్రకటనలు చేసింది. రెండింటి మధ్య తప్పును తెల్సుకుని హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. వివేకా హత్య జరిగిన రోజు నేను రాత్రి 10.30 గంటలకు పడుకొని పక్కరోజు ఉదయం 5 గంటలకు లేచాను. ఆ రాత్రి నా నుంచి ఎవరికీ ఫోన్, మెసేజ్ వెళ్లలేదు. ఎర్రగంగిరెడ్డి నుంచి నాకు ఎలాంటి మేసేజ్ రాలేదు. హత్యకు ఒక రోజు ముందు నాకు రెండు, మూడుసార్లు సౌభాగ్యమ్మ, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ఫోన్ చేసి తక్షణం నువ్వు కాణిపాకం వెళ్లాలని ఒత్తిడి తెచ్చారని, అందువల్ల సెలవు తీసుకున్నానని వివేకా ఇంట్లో పని చేసే పన్నింటి రాజశేఖర్ సీబీఐకి వాంగ్మూలం ఇచ్చాడు.
2020 జూలై 20న తన భర్త.. వివేకా రాసిన డెత్ నోట్ ఫొటో చూపించారని సునీత సీబీఐకి వాంగ్మూలం ఇచ్చింది. ఆగస్టు 27న లెటర్ గురించి ఏమీ తెలియదని, ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ చూపించారని చెబుతోంది. నెలలోనే ఎందుకు మాట మార్చింది? హత్య జరిగిన 10 రోజులకు వివేకా నన్ను ఎంపీని చేసేందుకు, జగనన్నను సీఎంను చేసేందుకు కష్టపడ్డారని సునీత చెప్పింది. ఈరోజు హత్యకు ఎంపీ టికెట్ మోటివ్ అని చెబుతున్నారు. ప్రత్యక్ష సాక్షి వాచ్మెన్ రంగన్న నలుగురి పేర్లు చెప్పినా వారిని దర్యాప్తు అధికారి అరెస్టు చేయలేదు. కస్టడీలోకి తీసుకొని విచారణ జరిపి వాస్తవాలు రాబట్టలేదు.
వివేకా హత్యపై నర్రెడ్డి, సునీత మొదట్లో ఒకలా, ఇప్పుడు ఒకలా మాట్లాడుతున్నారు. వివేకా పెద్ద బావమరిది శివప్రకాష్‌రెడ్డి ఫోన్ చేస్తేనే నేను వెళ్లా. డెడ్‌బాడీని చూసి బయటకు వచ్చేశాను. సీఐకి ఫోన్ చేసి త్వరగా రమ్మన్నాను. డెత్ నోట్లో ఉన్న వాస్తవ విషయాన్ని చెప్పకుండా ఘటనా స్థలంలోకి నన్ను వెళ్లమని ఎందుకు చెప్పారు? లెటర్లో ఉన్న విషయం తెలిసిన వెంటనే నర్రెడ్డి ఎందుకు పోలీసులకు చెప్పలేదు?, హార్ట్ అటాక్ అనే విషయం సునీత కుటుంబం నుంచే ప్రచారమైంది. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి సైతం అదే రోజు మీడియాకు అదే చెప్పారు. హార్ట్ అటాక్ అని ఫిర్యాదు చేయాలని పీఏ కృష్ణారెడ్డికి చెప్పినట్లు సునీత చెప్పారు. డెత్‌నోట్ చదివాక కూడా ఇలా ఎందుకు చెప్పారు.
వివేకా చనిపోయేంత వరకు నాకోసం పనిచేశారు. సునీత కూడా మొదట్లో ఈ విషయాన్ని చెప్పింది. అలాంటప్పుడు ఎంపీ టికెట్ మోటివ్ అని ఎలా చెబుతారు? మా ఎంపీటీసీ, జెడ్పీటీసీలను కొని వివేకాను ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ బీటెక్ రవి మీద ఓడించింది చంద్రబాబు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ఓట్లు కలిపి కౌంట్ చేస్తే పులివెందులలో మాత్రమే తక్కువగా వచ్చాయని ఎలా చెబుతారు. వివేకా చివరి రెండేళ్లు డబ్బు కోసం చాలా ఇబ్బందులు పడ్డారని పని మనుషులు వాంగ్మూలమిచ్చారు. ఆస్తి ఆమ్మే అవకాశం లేదు. చెక్ పవర్ రద్దు చేశారు. రెండో భార్య షమీమ్, అమె కుమారుడి కోసం ఇబ్బందులు పడ్డారు. డబ్బు కోసం సెటిల్మెంట్లు అంటూ తిరిగారు. ఎవరెన్ని అబద్దాలు చెప్పినా న్యాయమే గెలుస్తుంది. సీబీఐ ఎప్పటికైనా లెంపలేసుకోక తప్పదు. నాకు న్యాయస్థానాలపై నమ్మకం, గౌరవం ఉంది. షర్మిల, సునీత ఆరోపణలను ప్రజలు విశ్వసించరు. ఇక నేను బీజేపీకిలోకి వెళ్తాననడం ‘జోక్ ఆఫ్ ది సెంచురీ’ అని ఓ విలేకరి ప్రశ్నకు సమాధానంగా అవినాశ్‌రెడ్డి చెప్పారు.