బహుశా మీకు గుర్తు ఉండే ఉంటుంది, గతంలో పవన్ కళ్యాణ్ చేసిన చాతుర్మాస్య దీక్ష. ఇది అలాంటి దీక్ష కాదు.అర్ధ మండల దీక్ష అంటే ఏమిటో తెలుసుకొందాం. నలభై ఒక్క రోజులు నిష్టగా అయ్యప్ప స్వామిని కొలిచే దీక్షా కాలాన్ని మండల దీక్ష అంటారు. అంతకాలం కఠిన నియమాలతో దీక్ష చేయలేని వారు 41 రోజుల్లో సగకాలం అంటే 21 రోజులు దీక్ష చేసి ముడుపులు చెల్లించుకొంటారు. ఈ సగం దీక్షనే అర్ధ మండల దీక్ష అంటారు .
గత నెల టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల ప్రకటనలో జనసేనకు 24 అసెంబ్లీ, మూడు పార్లమెంట్ స్థానాలను కేటాయించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఈ నిర్ణయం జన సైనికులలోనూ, కాపు సామాజిక వర్గంలోనూ తీవ్ర వ్యతిరేకత తెచ్చిన విషయం విదితమే, టీడీపీ జనసేన పొత్తులో భాగంగా జనసేన 50 స్థానాలకు తగ్గకుండా పోటీ చేస్తుందని, తద్వారా అధికారంలోనూ భాగం పంచుకొంటుందని ఆ విధంగా కాపుల సుదీర్ఘ కల అయిన రాజ్యాధికారం కల కొంతమేరకైనా పవన్ ద్వారా నెరవేరుతుందని ఆశ పెట్టుకొన్న కాపు వర్గం పవన్ కేవలం 24 సీట్లతో సరిపెట్టుకోవడం. అవి కూడా జనసేనకు పట్టు లేనివి కావడంతో కాపులు, జన సైనికులు పవన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు.
వెంటనే దిద్దుబాటు చర్యలకు పూనుకొన్న పవన్ తాను పిచ్చి వాణ్ని అయ్యి 24 సీట్లు తీసుకోలేదని గాయత్రి మంత్రంలో ఉండే 24 అక్షరాలకు ప్రతీకగా 24 సీట్లు తీసుకొన్నానని ప్రకటించారు . అయితే ఇప్పుడు బిజెపితో పొత్తులో భాగంగా ఆ 24 సీట్లలో కూడా 3 సీట్లు కోత పెట్టి బిజెపికి పంచాడు బాబు. ఇహ చివరికి పవన్ చేతిలో 21 సీట్లు మిగిలాయి. మళ్ళీ మూడు సీట్లు త్యాగం చేయడంతో జన సైనికుల నుండీ, కాపు సంఘాల నుండీ వచ్చే విమర్శలకు సమాధానంగా 21 సీట్లు ఊరక తీసుకోలేదని అయ్యప్ప స్వామి అర్ధ మండల దీక్ష 21 రోజులు కాబట్టి 21 సీట్లు తీసుకొన్నానని కొత్త కథ చెప్పవచ్చని విమర్శకుల అభిప్రాయం.