ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు శుక్రవారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. గ్రూప్1 ప్రిలిమినరీ పరీక్షకు మొత్తం 1,48,881 మంది అభ్యర్ధులు దరఖాస్తులు చేసుకోగా.. వారిలో 1,26,068 మంది అంటే 84.67 శాతం మంది హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. కాగా పరీక్షకు మాత్రం 72 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. పేపర్ 1 పరీక్షకు 91,463 అంటే 72.55 శాతం మంది, పేపర్ 2 పరీక్షకు 90,777 అంటే 72 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు రెండు పేపర్లు రాసిన వారిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.
ప్రిలిమినరీ పరీక్ష తర్వాత మెయిన్స్ పరీక్షను నిర్వహిస్తారు. ప్రిలిమ్స్ రాసిన అభ్యర్థులును ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మెయిన్స్ కు ఎంపిక చేస్తారు. అలా పరీక్ష రాసిన వాళ్లలో 4,496 మంది అభ్యర్ధులు మెయిన్స్‌కు అర్హత సాధించారు. గ్రూప్ 1 ఫలితాలతో పాటు పేపర్ 1, 2లకు సంబంధించిన తుది ఆన్సర్ ‘కీ’లను కూడా ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించిన 24 రోజుల్లోనే కమిషన్ ఫలితాలు విడుదల చేయడం గమనార్హం. ఏపీపీఎస్సీ చరిత్రలో మొదటిసారి ఇంత వేగంగా ఫలితాలు ప్రకటించడం. మొత్తం 81 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ ఈ నియామక ప్రక్రియను చేపట్టింది. తదుపరి దశ అయిన మెయిన్స్ పరీక్షలు సెప్టెంబరు 2 నుంచి 9 వరకు నిర్వహించనున్నట్ల ఇప్పటికే ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది.