సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని పోలింగ్ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలు ఓటు హక్కును ఎటువంటి ఇబ్బంది లేకుండా వినియోగించుకునేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఏపీ మహిళా కమిషన్ కోరింది. ఈ మేరకు ఎన్నికల కమిషనర్‌కు మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకట లక్ష్మి లేఖ రాశారు. అలాగే సాధారణ మహిళలకు సంబంధించి ఆమె పలు విజ్ఞప్తులు చేశారు.
అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద మహిళలకు తప్పనిసరిగా వేరుగా క్యూ లైన్లు ఏర్పాటు చేయాలి. చిన్న పిల్లలతో వచ్చే బాలింతలకు ప్రత్యేకంగా ఫీడింగ్ రూమ్ అందుబాటులో ఉంచాలి. ఓటు వేయడానికి వచ్చే గర్భిణులకు అత్యవసర పరిస్థితులు తలెత్తితే వెంటనే వైద్యసేవలందే విధంగా చూడాలి. రాష్ట్రంలో ఎన్నికల నాటికి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నందున వడదెబ్బకు గురి కాకుండా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద షామియానాలు ఉండేలా చూడాలి. తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఏర్పాటు చేయాలి. మహిళల కోసం అత్యవసర వైద్య సేవల సిబ్బందిని నియమించాలి. విధిగా మొబైల్ టాయిలెట్స్ పెట్టాలి.
దాడులు, లైగింక వేధింపులు తదితర విషయాల్లో మహిళలను పరామర్శించి న్యాయం చేసేందుకు మేము కృషి చేస్తున్నాం. ఈ నేపథ్యంలో ఎక్కడైనా అనుకోని ఘటనలు జరిగితే బాధితులను పరామర్శించేందుకు వీలుగా మహిళా కమిషన్ చైర్పర్సన్, సభ్యులకు ఎన్నికల నిబంధనల్లో సడలింపు ఇవ్వాలి. ట్రైబల్ మహిళలు ఉండే ప్రాంతాల్లో మినహాయింపు ఇస్తే కమిషన్ తరఫున అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం అని ఎన్నికల కమిషన్ కు రాసిన లేఖలో తెలియజేసారు.