ఏపీ మరోసారి జాతీయ స్థాయిలో సత్తా చాటింది. ప్రభుత్వ హాస్పిటళ్లను మరింత మెరుగ్గా తీర్చిదిద్ధేందుకు జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్పలితాలు ఇస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆసుపత్రులకు దేశంలోనే అత్యధికంగా 3,161 కాయకల్ప అవార్డులు దక్కాయి. 2,619 ఆసుపత్రులతో తమిళనాడు రెండో స్థానంలో నిలిచింది. కేంద్ర ఆరోగ్య శాఖ పార్లమెంట్ లో ఈ విషయాన్ని ప్రకటించడం గమనార్హం.
వివరాల్లోకి వెళితే పరిశుభ్రతను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం 2014లో స్వచ్ఛ భారత్ అభియాన్ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అదే విధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిశుభ్ర వాతావరణాన్ని పెంపొందించి అంటు వ్యాధులు, ఇన్ఫెక్షన్లు నియంత్రించడానికి ‘కాయకల్ప’ అనే కార్యక్రమాన్ని 2015లో ప్రారంభించింది. మొత్తంగా ఏడు అంశాలను పరిగణనలోకి తీసుకుని అవార్డుల కేటాయింపుకు శ్రీకారం చుట్టిన కేంద్ర ప్రభుత్వం 2022–23సంవత్సరానికి గాను దేశవ్యాప్తంగా 20,336 ప్రభుత్వ ఆస్పత్రులకు ఈ అవార్డులను కేటాయించింది. కాగా అత్యధికంగా 3,161 కాయకల్ప అవార్డులు మన రాష్ట్రంలో ఉన్న హాస్పిటళ్ళకు దక్కడం గమనార్హం.
కాయకల్ప కార్యక్రమంలో భాగంగా ఆసుపత్రుల్లో స్వచ్ఛత, రోగులకు, వారి కుటుంబ సభ్యులకు అందుతున్న సదుపాయాలు, బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్, ఇన్ఫెక్షన్ సోకకుండా తీసుకుంటున్న జాగ్రత్తలు, పారిశుధ్యం, రికార్డుల నమోదు, సిబ్బంది పనితీరు వంటి ఏడు ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం ఆసుపత్రులకు అవార్డులను ప్రదానం చేస్తోంది. ప్రభుత్వ హాస్పిటళ్లను మరింత మెరుగ్గా తీర్చిదిద్ధేందుకు జగన్ ప్రభుత్వం నాడు నేడు వంటి కార్యక్రమాలు చేపట్టడంతో ప్రభుత్వ హాస్పిటళ్ళ రూపురేఖలు మారాయి. అందుకు ప్రతిఫలంగానే దేశం మొత్తంలో అత్యధిక కాయకల్ప అవార్డులు మన రాష్ట్రానికి దక్కాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.
కాగా 2,619 కాయకల్ప అవార్డులతో తమిళనాడు రెండో స్థానంలో నిలవగా, 2,414 కాయకల్ప అవార్డులతో ఒడిశా మూడో స్థానంలో నిలవడం విశేషం. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణలో 734, కర్ణాటకలో 371, కేరళలో ఆస్పత్రులకు మాత్రమే అవార్డులు లభించాయి. ఇదిలా ఉండగా ఆస్పత్రుల్లో జాతీయ స్థాయిలో నాణ్యత ప్రమాణాలు పాటించే విభాగంలోనూ ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. 2022–23లో దేశవ్యాప్తంగా 2,041 ఆస్పత్రులకు నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ (ఎన్క్వాష్) లభించగా.. ఇందులో 18 శాతం ఆస్పత్రులు ఏపీ నుంచి ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు విషయంలో జగన్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందనడానికి ఈ గణాంకాలనే ప్రధాన ఉదాహరణలుగా చెప్పొచ్చు.