ఎన్నికల ప్రచారంలో భాగంగా చిలకలూరిపేటలో ఎస్ఎఎస్ ఫంక్షన్ హాల్ లో ముస్లిం పెద్దలు, ప్రతినిధులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు వైసీపీ మైనారిటీ నాయకులు. ఈ కార్యక్రమంలో నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ముస్లింలు తమ బిడ్డల కోసం , భవిష్యత్తు తరాల కోసం వైసీపీనీ గెలిపించి అండగా ఉండాలని కోరారు. వైసీపీ గెలుపులో మొదటినుండి ముస్లింలకి ప్రత్యేక స్థానం ఉందని, అలాగే పార్టీలో అధినేత జగన్ మొదటి నుండి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన వెల్లడించారు. 2014లో నాలుగు సీట్లు కేటాయించారని, 2019లో ఐదు సీట్లు కేటాయించారని, ఈసారి రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటి సారిగా ఏడు సీట్లు కేటాయించారని అనిల్ కుమార్ యాదవ్. అంతే కాకుండా నెల్లూరు సిటీలో మైనారిటీకి సీటు ఇవ్వాద్దని వేల కోట్ల రూపాయల అధిపతి వేమిరెడ్డి ప్రభాకర్ కోరినా, గొడవ చేసిన వెనక్కి తగ్గకుండా ఒక సామాన్య ముస్లిం సోదరుడికి టికెట్ ఇచ్చిన ఘనత వైసీపీ అధినేత జగన్ దని కొనియాడారు. ఆ సీటు మైనారిటీ కి ఇచ్చారని ఆ తరువాత వేమిరెడ్డీ టీడీపీలో జాయిన్ అయ్యారనే విషయాన్ని అనిల్ కుమార్ యాదవ్ బట్టబయలు చేశారు.
అలాగే బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్ బిల్లును తీసేస్తారు. దీని వలన ముస్లిం పిల్లల చదువులకు, వారి భవిష్యత్తుకు అంధకారం అలముకుటుందని, డాక్టరు వైఎస్ఆర్ గారు తెచ్చిన ఈ రిజర్వేషన్ పుణ్యమా అని ముస్లిమ్ కమ్యూనిటీ లో వేల మంది డాక్టర్, ఇంజనీర్లు అయ్యారని తెలిపారు. నర్సరావుపేట పక్కన ఒక చిన్న గ్రామంలో 13 మంది డాక్టరు విద్యను అభ్యసించారు. ఇదంతా వైఎస్ఆర్ గారు ప్రవేశ పెట్టిన ముస్లిం రిజర్వేషన్ వలనే సాధ్యం అయింది అని తెలిపారు. అలాగే ఎమ్మెల్సీ లు కూడా అధికంగా ఇవ్వడమే కాకుండా మొదటిసారి మండలిలో ముస్లిం మహిళకు డిప్యూటీ మండలి చైర్మన్ గా అవకాశం ఇచ్చారు. అంతే కాకుండా మొదటిసారి హఫీజ్ ఖాన్ కు రాజ్యసభ అవకాశం ఇస్తాను అని జగన్ గారు హామీ ఇచ్చిన విషయన్ని తెలిపారు. ఈ సభలో చిలకలూరిపేట వైసీపీ అభ్యర్థి మనోహర్ నాయుడు, కర్నూలు ఎంఎల్ఏ హఫీజ్ ఖాన్, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, జ్ఞానేశ్వర ఫౌండేషన్ ఛైర్మన్ షేక్ జాన్ సైదా ఇతర ప్రముఖ ముస్లిం నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.