‘అప్పు-డే తెల్లారిందా’ ఈ మాటతోనే చాలామంది మధ్యతరగతి జీవుల రోజు మొదలవుతుంది. అనేక మధ్యతరగతి కుటుంబాలు అప్పు భయంతోనే బతుకు ఈడుస్తూ ఉంటాయి. అయితే.. బడా పారిశ్రామిక వేత్తలకు మాత్రం అలా కాదు. నెత్తిమీద ఉన్న అప్పుల కుప్ప గురించి వాళ్లకు ఎటువంటి చింత ఉండదు. ‘అప్పు చేసి పప్పు కూడు తినరా ఓ నరుడా!’ గీతాన్ని ఒంటబట్టించుకున్న ఆ బడా నేతలకు రుణపాశమంటే భయమే ఉండదు. అందుకే వాళ్లు అవసరం కోసం అప్పు చేయరు.. విలాసాల కోసం, హంగూ ఆర్భాటాల కోసమే బ్యాంకుల వద్ద అప్పులు తీసుకుని చివరికి వాటిని ముంచేస్తున్నారు. గతంలో విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, చోక్సీ వంటి వాళ్లు ఆ బాపతుకు చెందిన వాళ్లే. అయితే.. విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాళ్లను మించి ఓ తెలుగువాడి అప్పుల చిట్టా ఉంది. సీబీఐ, ఈడీ కేసులు అందుకు సాక్ష్యంగా కూడా ఉన్నాయి. డొల్ల కంపెనీలను ఏర్పాటు చేయడం.. వాటి ద్వారా అప్పులు చేయడం.. ఆయనకు పరిపాటి. ఆ క్రమంలోనే అనేక కంపెనీలను స్థాపించిన ఆయన.. ఆ తర్వాత వాటిపై అప్పులు చేసి బోర్డు తిప్పేశారు. ఒకప్పుడు పెద్ద ఇండస్ట్రియలిస్ట్‌గా ఉన్న ఆ రాజకీయ నేత.. ప్రస్తుతం ఒక్క కంపెనీని కూడా నిర్వహించడం లేదంటే అర్థం చేసుకోవచ్చు. ఏ రేంజ్లో అప్పులు చేశారో… ఆ తర్వాత వాటిని ఎలా ఎగ్గొట్టారో.. ఇంతలా చెప్పుకుంటున్న ఆయన ఎవరో సామాన్యులకు కూడా తెలుసు. అటువంటి వ్యక్తికి ఇప్పుడు ఎమ్మెల్యే సీటు ఇచ్చేందుకు బీజేపీ కేంద్రనాయకత్వం సిద్ధమవుతోందది. ఆయనే మాజీ రాజ్యసభ ఎంపీ వైఎస్ చౌదరి అలియాస్ సుజనా చౌదరి. 1986లో ప్రారంభమైన సుజనా గ్రూప్ కంపెనీలకు అధినేత.
సుజనా చౌదరి మీద సీబీఐ, ఈడీ కేసులు ఎందుకున్నాయి? దర్యాప్తు ఎలా సాగుతుంది?
సుజనా చౌదరిపై కేసుల పరంపర 2017 నుంచి ప్రారంభమైంది. ఆ ఏడాదిలో మూడు బ్యాంకులు.. తమను మోసం చేశాడంటూ సీబీఐ బ్యాంకింగ్ సెక్యూరిటీస్, ఫ్రాడ్ సెల్‌కు ఫిర్యాదు చేశాయి. 2010 నుంచి 2013 మధ్ కాలంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్‌లు సుజనా గ్రూప్‌కు చెందిన చెన్నై లోని బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ లిమిటెడ్‌కు అప్పులు ఇచ్చాయి. అయితే.. తప్పుడు స్టేట్మెంట్ల ఆధారంగా రుణాలు తీసుకున్నట్టు బ్యాంకులు గుర్తించాయి. దీనిపై సీబీఐకి ఫిర్యాదు చేశాయి. కంప్లైంట్ ఆధాFefరంగా దర్యాప్తు చేపట్టిన కేంద్ర సంస్థ మోసపూరితంగానే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ. 133 కోట్లు, ఆంధ్రా బ్యాంక్ నుంచి రూ. 71 కోట్లు, కార్పొరేషన్ బ్యాంక్ నుంచి రూ. 159 కోట్లు వద్ద లోన్లు తీసుకున్నట్టుగా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. కంపెనీ నలుగురు డైరెక్టర్ల పైన, సుజనా చౌదరి పైన, కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కాకులమర్రి శ్రీనివాస్ కళ్యాణ్, అలాగే కంపెనీ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్‌పై కాన్స్పిరసీ, ఫోర్జరీ, చీటింగ్ ఆరోపణల కింద కేసులు నమోదు చేసింది సీబీఐ. ఇన్ని కేసులు ఎదుర్కొంటున్న సుజనాకు బీజేపీ అండగా ఉందనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే కేసులు ముందుకు కదలడం లేదనే సందేహాలున్నాయి.
సీబీఐ కేసుల తర్వాత వెంటనే రంగంలోకి ఈడీ. సుజనా ఇళ్లు, సంస్థలపై సోదాలు, కేసులు
సీబీఐ వేసిన కేసుల తరువాత ఈడీ కూడా ఎంక్వైరీని ప్రారంభించింది. సుజనా చౌదరిపై కేసులు నమోదు చేసి ఆస్తులను కూడా అటాచ్ చేసింది. మూడు ఎఫ్ఐఆర్ల ఆధారంగా మనీ లాండరింగ్ చట్ట ప్రకారం అక్టోబర్ 2018లో విచారణ మొదలు పెట్టింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అక్టోబర్ 2018లో బీఈసీపీఎల్ చెన్నై, హైదరాబాద్, బెంగళూరుల్లోని కార్యాలయాలు, ఇళ్లలో సోదాలు చేశారు ఈడీ అధికారులు. నవంబర్ 2018లో కేంద్ర దర్యాప్తు సంస్థ ఇచ్చిన పత్రిక ప్రకటన ప్రకారం.., ఈ సోదాల్లో నేరారోపణ చేసే పత్రాలు, అలాగే డొల్ల కంపెనీలకు చెందిన 126 రబ్బర్ స్టాంపులు హైదరాబాద్ నుంచి స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటించారు. సుజనా గ్రూప్ డైరెక్టర్ల వాంగ్మూలాను కూడా రికార్డు చేశారు. కంపెనీలు అన్నీ సుజనా చౌదరి అధ్యక్షతన పనిచేస్తున్నట్టు తెలిపింది ఈడీ. బీఈసీపీఎల్ డైరెక్టర్ల నుంచి మనీ లాండరింగ్ చట్టం కింద సెక్షన్ 50 కింద తీసుకున్న వాంగ్మూలంలో.. తాము కేవలం పేరుకే డైరెక్టర్లమని, కంపెనీకి నిధులు ఎలా వస్తున్నాయి, ఆ నిధులు ఎలా ఉపయోగిస్తున్నారు, ఇతర లావాదేవీల విషయాలు తమకు తెలియదని డైరెక్టర్లు ప్రకటించడం విశేషం. అటువంటి బీజేపీ నేత ఇప్పుడు క్షేత్రస్థాయి రాజకీయాల్లోకి రావాలని అనుకుంటన్నారు. మరి అది సాధ్యమేనా?
బ్యాంకు మోసాల కథ అంతటితో ఆగిందా? ఇంకా కొనసాగిందా?
మూడు బ్యాంకుల ఫిర్యాదుతో కథ ముగియలేదు. శిశుపాలుడి నోరు ఆగనట్టుగానే సుజనా చౌదరి కంపెనీల బాగోతం బయటకు వస్తూనే ఉంది. నవంబర్ 23, 2018లో హైదరాబాద్‌లోని 7 చోట్ల, ఢిల్లీలో ఒక చోట సోదాలు నిర్వహించింది ఈడీ. ఈ సోదాల్లో సుజనా గ్రూప్ కంపెనీలు రూ. 5,700 కోట్ల పైగా బ్యాంకులను మోసం చేసినట్టు వెల్లడైందని తెలిపింది దర్యాప్తు సంస్థ. మాజీ ఎమ్మెల్యే కనుసన్నల్లో ఒకటీ రెండు కాదు ఏకంగా 120 డొల్ల కంపెనీలు ఉన్నట్టుగా ఈడీ గుర్తించింది. ఆ కంపెనీలు అన్నీ కేవలం పేపరు మీద మాత్రమే ఉన్నట్టుగా సంస్థ వెల్లడించింది. అంతేకాక, సుజనా చౌదరి నివాసంలో ఉన్న ఆరు ఖరీదైన ఫెరారీ, రేంజ్ రోవర్, బెంజ్ కార్లను స్వాధీనం చేసుకుంది. మళ్లీ ఏప్రిల్ 2019లో సుజనా గ్రూపు నుంచి వైస్రాయ్ హోటల్స్ ఆస్తులు బదిలీ అయ్యాయని గుర్తించిన ఈడీ 315 కోట్ల రూపాయల ఆస్తులను ఎటాచ్ చేసింది. ఇక.. సుజనా చౌదరికి సంబంధించిన 20కి పైగా కంపెనీలు జీఎస్టీ అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. దానిపై ఆయన సంస్థలు కోర్టుకు వెళ్లాయి. మూడేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఆ కేసులు సాగుతూనే ఉన్నాయి.
సుజనా చౌదరి.. అక్రమాల ఖజానాకు వారదీ ఎలా?
సుజనా చౌదరి ప్రత్యక్షంగా, పరోక్షంగా నిర్వహిస్తున్న వాటిలో బీసీఈపీఎల్, సుజనా యూనివర్శల్ ఇండస్ట్రీస్, సుజనా మెటల్ ప్రొడక్డ్, సుజనా టవర్స్ వంటి లిస్టెడ్ కంపెనీలతో పాటు మరో 126 ఇతర కంపెనీలు ఉన్నాయి. బార్టోనిక్స్ కూడా లిస్టెడ్ కంపెనీయే. సుజనా నేతృత్వంలోని ఎనిమిది కంపెనీలు.. సుజనా యూనివర్శల్, సుజనా మెటల్ ప్రొడక్ట్స్, సుజనా టవర్స్, విజయ్ హోం అప్లయన్సెస్, బార్టోనిక్స్, మెడ్‌సిటీ, లక్ష్మీగాయత్రి, బెస్ట్ అండ్ క్రాంప్టన్ తప్ప మిగిలినవన్నీ షెల్ కంపెనీలే. ఇవి సర్క్యులర్ ట్రేడింగ్, బుక్ బిల్డింగ్, మనీ లాండరింగ్, పన్ను ఎగవేత వంటి అక్రమ కార్యకలాపాలలో దిట్టలు. ఆ సంస్థల్లో లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చూపించి సుజనా గ్రూపు సంస్థలు వివిధ జాతీయ, ప్రైవేటు బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి మొత్తం రూ.5,700 కోట్లకుపైగా రుణాలు తీసుకున్నాయి. అయితే, సుజనా చౌదరి సంస్థల ఆస్తుల విలువ రూ.132 కోట్లకు మించదనే సమాచారంతో ఈ గ్రూపు కంపెనీల వాటాలను కొన్న షేర్ హోల్డర్లు భారీగా నష్టపోయారు. అంటే.. ఓ కంపెనీని స్థాపించి దాన్ని విలువ అమాంతం పెంచేసి.. ఆ తర్వాత దాన్ని అమ్మేసుకుంటూ ఖజానాను నింపుకుంటున్నట్టు తెలుస్తోంది.
బ్యాంకుల్లో రుణాలు.. సూట్‌కేసు కంపెనీల ద్వారా దారి మళ్లింపులు
బ్యాంకుల నుంచి దోచేసిన సొమ్ముతో దేశ, విదేశాల్లో సుజనా చౌదరి భారీ ఎత్తున ఆస్తులు పోగేశారు. బ్యాంకులను దోచేసిన సొమ్ముతోనే సుజానా అనేక ఆస్తులను కొన్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. గతంలో దేశవ్యాప్తంగా విజయ మాల్యా బ్యాంకులకు శఠగోపం పెట్టారు. అయితే.. ఆ మొత్తానికి సమానం కాకపోయినా దాదాపు అంత పెద్ద స్థాయి ఆరోపణలు కావడంతో సుజనా చౌదరిని ప్రత్యర్థి పార్టీలు ఆంధ్ర మాల్యా అని ఆయనపై విమర్శలు చేస్తున్నాయి. అయితే.. ఎన్ని విమర్శలు వస్తున్నా.. మరెన్నో ఆరోపణలు వస్తున్నా ఆ మాజీ ఎమ్మెల్యే మాత్రం అవన్నీ తన ఆస్తులు కాదని అంటారు. మరి ఇన్ని కార్లు, విలాస వంతమైన భవనాలు ఎక్కడివి అంటే తన పేరుతో లేవని అంటారు. అంతవరకూ ఎందుకు తన పొలిటికల్ అఫిడవిట్లో కూడా తన ఆస్తులు, అప్పులను సరిగ్గా చెప్పలేదు. 2015 అఫిడవిట్లో సుజనా చౌదరి తన ఆస్థులను రూ.123 కోట్లుగా, అప్పులను కేవలం రూ.5 కోట్లుగా మాత్రమే ప్రకటించారు. ఇలా వ్యవస్థలను మ్యానేజ్ చేస్తూ అటు కేసుల దర్యాప్తును ఇంచి కూడా ముందుకు వెళ్లకుండా చేస్తున్నారు వైఎస్ చౌదరి. ప్రస్తుతం ఆయన బీజేపీ తరఫున ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా అయ్యేందుకు ప్రయత్నించిన ఆయన.. అందులో విఫలమయ్యారు. ఇటువంటి తరుణంలోనే ఎమ్మెల్యే సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అదే జరిగితే.. బీజేపీ తరఫున ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తే నీతిమంతులమని చెప్పుకుంటున్న కమలదళానికి మచ్చ తప్పదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.